Perini Dance: పేరిణి నాట్యం పూర్వ వైభవం కోసం తెలంగాణ కళాకారుల కృషి, కళ గొప్పతనం తెలుసుకోండి
Perini Dance History: కాకతీయ సామ్రాజ్యం అనంతరం ఈ నాట్యం మరుగున పడిపోయింది. కానీ 20వ శతాబ్దంలో డాక్టర్ నటరాజ్ రామకృష్ణ ఈ నాట్యాన్ని పునరుద్ధరించడానికి విశేష కృషి చేశారు.
Perini Dance History: పేరిణి నాట్యం తెలంగాణ ప్రాంతానికి చెందిన పురాతన నాట్యకళ. కాకతీయుల కాలంలో సైనికులను యుద్ధానికి సన్నద్ధం చేయడానికి పేరిణి శివతాండవం ప్రదర్శించేవారు అని చరిత్రకారులు చెబుతారు. మహా శివుని ఆరాధిస్తూ ప్రదర్శించే ఈ పేరిణి నాట్యాన్ని యోధుల నృత్యంగా కూడా పిలుస్తారు. పేరిణి నాట్యంలోని పాదాల కదలికలు, మృదంగ ధ్వనులు, శరీర కదలికలు, ఓంకార నాదాలతో భోళా శంకరుడు స్వయంగా తాండవం చేస్తున్నాడా అనే అనుభూతిని కలిగిస్తాయి.
చరిత్ర:
పూర్వం యుద్ధ రంగానికి వెళ్లే ముందు సైనికులు మహా శివుని ఆరాధిస్తూ పేరిణి శివతాండవాన్ని భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేవారు. లయబద్ధంగా సాగే డప్పుల సప్పుళ్ళు, మృదంగ ధ్వనులే ఈ నృత్యానికి నేపథ్య సంగీతం. 11వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు కాకతీయ సామ్రాజ్యంలో ఈ నాట్యం ప్రాచుర్యం పొందింది. కాకతీయ రాజుల కాలంలో రచించిన నాట్య రత్నావళి లో ఈ నాట్యానికి సంబంధించిన అన్ని అంశాలనూ సవివరంగా గ్రంథస్థం చేశారని చరిత్రకారులు చెబుతారు.
కాకతీయ సామ్రాజ్యం అనంతరం ఈ నాట్యం మరుగున పడిపోయింది. కానీ 20వ శతాబ్దంలో డాక్టర్ నటరాజ్ రామకృష్ణ ఈ నాట్యాన్ని పునరుద్ధరించడానికి విశేష కృషి చేశారు. నాటి శిల్పాలు, గ్రంథాలు ఆధారంగా పేరిణి శివతాండవాన్ని ఆధునిక కాలానికి తగిన విధంగా తిరిగి రూపొందించారు. వారి ప్రోత్సాహంతో, నేడు తెలంగాణ ప్రాంతంలో పేరిణి నాట్యం తిరిగి పూర్వ వైభవాన్ని పొందేందుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కృషి చేస్తోంది.
ప్రస్తుత పరిస్థితి:
ప్రస్తుతం తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన ధారావత్ రాజ్ కుమార్ నాయక్ పేరిణి పునరుద్ధరణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బాల్యంలో ఆంధ్ర నాట్యం నేర్చుకుని, ఆ తర్వాత అఫ్జల్ పాషా వంటి గురువుల సహకారంతో పేరిణి శివతాండవ నాట్యంలో ఆసక్తి కనబరిచారు. నాట్య గురువు కాళా కృష్ణ గారి వద్ద శిక్షణ తీసుకున్న తర్వాత, డాక్టర్ నటరాజ్ రామకృష్ణతో కలిసి, పేరిణి నాట్యాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడంలో ప్రధాన పాత్ర పోషించారు.
రాజ్ కుమార్ కృషితో పేరిణి శివతాండవం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. 2016-17లో 101 రోజుల పాటు నిర్విరామంగా వర్క్ షాప్ నిర్వహించి, 31 జిల్లాల్లో 200 ప్రదర్శనలు ఇచ్చి, పేరిణి నాట్యాన్ని తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, నాట్య కళాకారులకు కూడా పరిచయం చేశారు. ఇటీవలి కాలంలో ఆయన అమెరికాలోని ఒర్లాండో, ఫ్లోరిడా పర్యటనలు చేసి పేరిణి నృత్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించారు. నేడు పేరిణి నాట్యం రెండు రూపాల్లో ప్రదర్శించబడుతోంది. పురుషుల కోసం ‘పేరిణి తాండవం’, మహిళల కోసం ‘పేరిణి లాస్యం’ రూపంలో ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
సాంస్కృతిక వారసత్వం:
పేరిణి శివతాండవ చరిత్రను కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో చూడవచ్చు. ముఖ్యంగా వరంగల్‌లోని వెయ్యి స్థంభాల గుడి, రామప్ప దేవాలయంలోని శిల్పాలు ఈ నాట్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నాట్య రత్నావళి ప్రకారం, ఈ శిల్పాలు నాట్యశాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన సూచనలను అందిస్తున్నాయి.
ప్రస్తుతం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ హరి కృష్ణ మామిడి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో పేరిణి నృత్య ప్రదర్శనలను ఏర్పాటు చేసారు. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ పేరిణి నృత్య శిక్షణా శిబిరాలను ప్రారంభించి, భవిష్యత్తు తరాలకు పేరిణి నృత్యం గొప్పతనాన్ని చాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజ్ కుమార్ తెలిపారు.