Telangana Youth: అట్లుంటది తెలంగాణ యూత్‌తోని, ప్రోగ్రామింగ్‌లో టాప్- కర్ణాటక, కేరళతో పోటీ
Telangana Youth: ఐటీ రంగంలో తెలంగాణ యువత ప్రతిభ చూపుతున్నారు. ప్రోగ్రామింగ్ రాయడంలో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు.
Telangana Youth: తెలంగాణ యువత దేశానికి దిక్సూచిగా మారుతున్నారు. ఐటీ రంగంలో, ప్రోగ్రామింగ్ రాయడంలో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. కర్ణాటక, కేరళతో పాటు తెలంగాణకు చెందిన పట్టణ యువకులు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో నైపుణ్యం కలిగి ఉన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. సెంట్రల్ స్టాటిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డిజిటల్ అక్షరాస్యత గణాంకాల ప్రకారం మూడు రాష్ట్రాలలో 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సున్న యువత 10% మంది ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను కలిగి ఉన్నారు.
తమిళనాడు 9 శాతంతో నాల్గో స్థానంలో ఉంది. మహారాష్ట్ర 6.5%తో రెండో స్థానంలో ఉంది. బిహార్, అసోం, ఛత్తీస్‌గఢ్, న్యూఢిల్లీ రాష్ట్రాల్లో 1% కూడా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాల్లో 3 శాతం మంది యువకులు నైపుణ్యం కలిగి ఉన్నారు. జాతీయ సగటు సైతం 3 శాతం మాత్రమే. ఈ వివరాలను పరిశీలిస్తే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, కర్ణాటక, కేరళ అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
గ్రామీణ ప్రాంతాలకు వస్తే ఈ లెక్కలు మారిపోయాయి. తెలంగాణ, కర్ణాటకలలో 3.5 శాతం గ్రామీణ యువతలో ప్రోగ్రామింగ్ నైపుణ్యం ఉంది. కేరళలో మాత్రం 9 శాతంగా ఉంది. ఉద్యోగం పొందడానికి మాత్రమే కాకుండా రాష్ట్రంలోని విషయాలను అర్థం చేసుకోవడానికి అక్కడి యువత చూపే చొరవ కేరళను ప్రత్యేక స్థానంలో నిలిపింది.
ఐటీని అభివృద్ధి చేయడంలో కర్ణాటక ముందు వరుసలో ఉంది. హైదరాబాద్ ఐటీపై దృష్టి పెట్టడంతో స్థానికంగా ఉన్నవారు ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. కానీ కేరళ విషయంలో అందరికి విద్య, సామాజిక ఆలోచన కారణమని అని టెక్ ట్రయాడ్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భర్ణి కె అరోల్ అన్నారు. తెలంగాణాలో దాదాపు తొమ్మిది లక్షల మంది ఐటీ, ఐటీ సంబంధిత సేవల ఉద్యోగులు ఉన్నారని మంత్రి కేటీ రామారావు చెప్పారు. టైర్-టూ నగరాల్లో ఐటీ విస్తరించడం ద్వారా రాష్ట్రంలో నైపుణ్యం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
డిజిటల్ అక్షరాస్యతలో..
డిజిటల్ అక్షరాస్యతలో తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపించింది. ఫైల్, ఫోల్డర్ కాపీ చేయడం, మూవ్ చేయడం, అదనపు ఫైల్‌లతో ఈమెయిల్ పంపడం, కాపీ, పేస్ట్ అంశాలు, కంప్యూటర్ ఆపరేటింగ్ స్కిల్స్, సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్, స్కిల్ లెవల్స్‌కు సంబంధించిన విషయాల్లో ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ మధ్యస్థ స్థాయిలో ఉందని కూడా వెల్లడైంది.
స్ప్రెడ్‌షీట్‌లో బేసిక్ ఫార్ములాలను ఉపయోగించడం, కనెక్ట్ చేయడం, కొత్త పరికరాలను ఇన్‌స్టాల్ చేయడం, సాఫ్ట్‌వేర్‌ను కనుగొనడం, డౌన్‌లోడ్ చేయడం, కాన్ఫిగర్ చేయడం, సాఫ్ట్‌వేర్‌తో ఎలక్ట్రానిక్ ప్రెజెంటేషన్‌ను రూపొందించడం (టెక్స్ట్, ఇమేజ్‌లు, సౌండ్, వీడియో లేదా చార్ట్‌లతో సహా), కంప్యూటర్ల మధ్య ఫైల్‌ల బదిలీ, స్పెషల్ లాంగ్యేజ్‌ను ఉపయోగించి కంప్యూటర్ ప్రోగ్రామ్ రాయడం వంటి అంశాలను తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 15-29 ఏళ్లలోపు యువత కేవలం 8% మంది మాత్రమే చేయగలుగుతున్నారు. కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో 25 శాతం కంటే ఎక్కువగా ఉంది.
పట్టణాల్లో తెలంగాణలో 24 శాతం మంది ఈ పనిని చేయగలరు. తమిళనాడు (36%), కర్ణాటక (30%), కేరళ (43%) వంటి రాష్ట్రాలు ముందున్నాయి. ఫైల్ లేదా ఫోల్డర్‌ను కాపీ చేయడం, మూవ్ చేయడం ప్రాథమిక పనుల విషయంలో స్పష్టమైన తేడా కనిపించింది. పట్టణ ప్రాంతాలలో 15-29 సంవత్సరాల వయస్సులో 43% మాత్రమే ఈ పనిని చేయగలరు.
ఇందులో హిమాచల్ ప్రదేశ్ (74%), కేరళ (89%), గోవా (75%), పంజాబ్ (55%) వంటి చిన్న రాష్ట్రాలు కూడా తెలంగాణ కంటే చాలా ముందున్నాయి. తెలంగాణాలో డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాబోయే కొన్నేళ్లలో పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు.