Teenmar Mallanna on KCR: సీఎం కేసీఆర్ ఎక్కడ పోటే చేస్తే అక్కడే చేస్తానంటున్న తీన్మార్ మల్లన్న!
Teenmar Mallanna on KCR: వచ్చే ఎన్నికల్లో సీఎం కేసఆర్ ఎక్కడ పోటీ చేస్తే తాను కూడా అక్కడే పోటీ చేస్తానని తీన్మార్ మల్లన్న చెబుతున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు.
Teenmar Mallanna on KCR: సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వస్తున్నట్లు తమకు సమాచారం ఉందని.. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే తాను కూడా అక్కడే పోటీ చేస్తానని తీన్మార్ మల్లన్న తెలిపారు. ఆయన చేపట్టిన 7200 ఉద్యమ పాదయాత్రకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అనుమతి ఇవ్వకపోవడంతో తాత్కాలికంగా పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన రెండు మూడు రోజుల్లోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా తాను కూడా అక్కడే పోటీ చేస్తానని వెల్లడించారు.
తన ప్రసంగాల వల్ల గొత్తి కోయలు మావోయిస్టుల్లో చేరతారని..
తన బృందం ప్రస్తుతం రాజకీయ పార్టీగా మారనుందని తెలిపారు. నవంబర్ 26వ తేదీన భద్రాచలంలో ప్రారంభమైన పాదయాత్ర 100 కిలో మీటర్లు విజయవంతంగా కొనసాగిందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు, కుతంత్రలు చేస్తోందని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడే తమను ప్రజల్లో తిరగనీయకుండా పోలీస్ వ్యవస్ ద్వారా అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. నేటి కేసీఆర్ రాజ్యంలో పాదయాత్రలు చేయాలంటే న్యాయస్థానాల అనుమతి పొందాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో తన ప్రసంగాలతో గొత్తి కోయలంతా మావోయిస్టుల్లో చేరతారని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారని తీన్మార్ మల్లన్న వివరించారు. ఇంతకాలం తాను ఇచ్చిన ప్రసంగాలతో ఎంత మంది మావోయిస్టుల్లో చేరారని ప్రశ్నించారు. అయితే పోలీసులు అందజేసిన ఈ నోటీసులపై తమ న్యాయ బృందం ద్వారా హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
‘7200 మూవ్‌మెంట్’ ద్వారా పోరాటం..
అయితే గతంలో 7200 యూట్యూబ్ ద్వారా మల్లన్న సీఎం కేసీఆర్ ను తిట్టడం ఆ తర్వాత ఆయన అరెస్టు అవడం లాంటివి చాలా జరిగాయి. కానీ ఆ తర్వాత ఆయన ఇకపై కేసీఆర్‌ను తిట్టబోనని ఒట్టేసి చెబుతున్నానని అన్నారు. అయితే, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయే వరకు మాత్రం తన ‘7200 మూవ్‌మెంట్’ ద్వారా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. పేద వారు, పేద బిడ్డలు ఒకే పాఠశాల వరుసలో కూర్చొని చదువుకోవాలన్నదే తమ పోరాట లక్ష్యం అని చెప్పుకొచ్చారు. ప్రజల్లో చైతన్యం కోసమే తమ పోరాటమని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి లేదా మంత్రుల పైన విమర్శలు చేస్తూ ఉండడం తన విధానం కాదని తీన్మార్ మల్లన్న అన్నారు.
‘‘ఒట్టేసి చెప్తున్నా.. ఇక నుంచి నేను సీఎం కేసీఆర్ ను నేను తిట్టను. ఇకపై 7200 మూవ్ మెంట్ ప్రజల్లో చైతన్యం కోసమే కొనసాగుతుంది." అని తీన్మార్ మల్లన్న చెప్పారు. రాష్ట్రంలో బాల్క సుమన్, గ్యాదరి కిషోర్ వంటి వారికి విద్యా శాఖను అప్పగిస్తే బావుంటుందని అన్నారు.