(Source: ECI/ABP News/ABP Majha)
Tata Group : తెలంగాణ ఐటీఐలలో టాటా గ్రూప్ స్కిల్ సెంటర్లు - సీఎం సమక్షంలో ఒప్పందం
Telangana News : తెలంగాణలోని ఐటీఐల్లో టాటా గ్రూప్ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఎం సమక్షంలో ఒప్పందం కుదిరింది.
Tata Group to set up Skill Centers in ITIs in Telangana : సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో టాటా గ్రూప్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. సంబంధిత ఎంవోయూ పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయనుంది టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ . ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతున్న టాటా టెక్నాలజీస్ .. 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించే బ్రిడ్జి కోర్సులను నిర్వహిస్తుంది. ఈ 2024-25 విద్యాసంవత్సరం నుంచే ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం.
మార్చి 11న తెలంగాణ కేబినెట్ భేటీ
మార్చి 11న తెలంగాణ కేబినెట్ సమావేశం కా నుంది. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ భేటీకి మంత్రులు, ఉన్నాతాధికారులు హాజరు కానున్నారు. ఈ కేబినెట్ భేటీలో పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మార్చి 11నే సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు. తొలుత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ వర్తింపజేసేలా విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు. సొంత జాగా ఉన్నవారికి అదే స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తామని ఎన్నికల టైమ్ లోనే కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
డబుల్ డెక్కర్ కారిడార్ కు శంకుస్థాపన
జంట నగరాలతో పాటు నార్త్ తెలంగాణలోని 5 జిల్లాల్లోని ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ఈ క్రమంలోనే నేషనల్ హైవే 44పై రూ.1580 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5320 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దీనిపై మెట్రో మార్గాన్ని కూడా నిర్మించనున్నారు. ఇది హైదరాబాద్ కు తొలి డబుల్ డెక్కర్ కారిడార్ కానుంది. కండ్లకోయ జంక్షన్ నుంచి ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ నుంచి మొదలయ్యే కారిడార్.. తాడ్ బండ్ జంక్షన్, బెయినపల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫామ్ వద్ద ముగుస్తుంది. కారిడార్ మొత్తం పొడవు 5320 కిలోమీటర్లు. ఎలివేటెడ్ కారిడార్ పొడవు 4650 కిలోమీటర్లు. ఇందులో 0.600 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంటుంది. మొత్తం 131 పిల్లర్లతో ఆరు వరుసలతో కారిడార్ ను నిర్మించనున్నారు.