Suryapet SP: మంత్రి జగదీశ్ రెడ్డిని బాహుబలితో పోల్చిన ఎస్పీ, సభలో జయహో అంటూ నినాదాలు
Suryapet SP: సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మంత్రి జగదీష్ రెడ్డికి జైకొట్టారు. యూనిఫాంలో ఉండగానే పొగడ్తలతో ముంచెత్తాతారు. దీనిపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Suryapet SP: స్టేజీపై ఉండగానే జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్.. మంత్రి జగదీష్ రెడ్డి జై కొట్టారు. జై జగదీషన్న.. జయహో జగదీష్ అన్నా అంటూ నినాదాలు చేశారు. ఆపై మంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. బాహుబలి సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు వచ్చే శబ్దం వల్ల గోడలకు బీటలు వచ్చింది అని... అలాంటి శబ్దం ఇప్పుడు చేయాలంటూ వ్యాఖ్యానించారు. శ్రీరాములు సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్టేజీపై ఉండి, యూనిఫాంలో ఉండగానే జిల్లా ఎస్పీ రాజేందర్ ప్రసాద్.. మంత్రి జగదీశ్ రెడ్డి ని పొగడ్తలతో ముంచెత్తడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
"ఆకలేస్తే కేకలేయమన్నాడు శ్రీశ్రీ.. ఆకలేస్తే కేకలేయమన్నాడు శ్రీశ్రీ.. మీకు ఆకలేస్తుందా... ఓకే. అయితే ఓ పని చేద్దాం.. జయహో జగదీశ్ రెడ్డి గారికి అంటాను.. మీరు జయహో, జయహో అనాలి ఓకేనా.. ఏం అనాలి. జయహో జగదీష్ రెడ్డి.. ఇంకా గట్టిగా.. బాహుబలి సినిమా చూశారా.. అందులేసే ప్రజలంతా అరిస్తే వచ్చిన శబ్దానికి గోడలకు బీటలు వచ్చాయి. ఇప్పుడు కూడా అలాగే రావాలి. గట్టిగా చెప్పండి.. జయహో జగదీష్ రెడ్డి". - రాజేంద్ర ప్రసాద్, సూర్యాపేట ఎస్పీ
రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు..
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా అన్ని జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్వహించిన జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో టీఆర్ఎస్ వర్గ పోరు రచ్చకెక్కింది. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చందు, స్థానిక ఎమ్మెల్యే తనయుడు అజయ్ ఇద్దరి మధ్య స్టేజిపై వాగ్వాదం జరిగింది. వజ్రోత్సవాలు ముగిసిన అనంతరం స్టేజిపై సాయి చందు అభిమానులు తనకు బొకేలు ఇచ్చి ఫొటోలు దిగుతున్న సందర్భంలో అజయ్ తన అనుచరులతో స్టేజిపై వచ్చి భౌతిక దాడికి దిగారు. అసభ్యకర పదజాలంతో దుర్భాషలాడుతూ సాయి చందుపై దాడికి పాల్పడ్డారు. సాయి చందు చేతికి గాయం కావడంతో ఆయనను అక్కడ నుంచి తరలించారు పోలీసులు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గిడ్డంగులు కార్పొరేషన్ చైర్మన్ సాయి చందు మాట్లాడుతూ తనపై దాడికి పాల్పడిన గుండాలను, రౌడీలను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ సభలో యువకుడి హల్ చల్..
తెలంగాణ మంత్రి కేటీఆర్ వేములవాడలో పర్యటిస్తున్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు భాగంగా భారీ బందోబస్తు నడుమ సభ జరుగుతుండగా ఓ యువకుడు ఒక్కసారిగా స్టేజి మీదకు వచ్చి కలకలం సృష్టించాడు. స్టేజిపై కేటీఆర్, ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్, బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు తోబాటు కలెక్టర్, ఎస్పీ కూడా ఉన్నారు. అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ యువకుడు స్టేజ్ పైకి దూసుకొచ్చాడు. దీంతో నాయకులు, పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలసులు అతన్ని పట్టుకొని వేదిక కిందికి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ యువకుడు ఇలా ఎందుకు చేశారో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతడు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలానికి చెందిన యువకుడిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.