Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుపై తెలంగాణకు టీఏసీ నివేదిక, ఏమంటుందంటే?
Srisailam Project: తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు రూల్ కర్వ్స్ రూపకల్పనక కోసం ప్రామాణికతలు తెలపాలంటూ కేంద్ర జల సంఘాన్ని కోరింది. స్పందించిన టీఏసీ శ్రీశైలం ప్రాజెక్టుపై నివేదికను అందజేసింది.
Srisailam Project: తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు రూల్ కర్వ్స్ రూపకల్పనకు అనుసరించిన విధానాలను తెలియజేయాలంటూ పలుమార్లు కోరగా... తాజాగా సాంకేతిక సలహా కమిటీ - 58వ సమావేశం నివేదకను అందజేసింది. కానీ తెలంగాణ నీటి పారుదల శాఖ తాము కోరుతున్న సమాచారం అది కాదని కృష్ణా బోర్డుకు నివేదించినట్లు తెలస్తోంది. జలాశయాల నిర్వహణ కమిటీ శ్రైశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల రూల్ కర్వ్స్ ను మరోమారు రూపొందిస్తూ... డ్రాఫ్ట్స్ నివేదికను తయారు చేయడం తెలిసిందే. ఇందులో శ్రీశైల ప్రాజెక్టు నుంచి ఏపీకి, తెలంగాణకు పలు ఔట్ లెట్ల ద్వారా కేటాయింపులు, జల విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్వహణ వివరాలను పేర్కొన్నారు.
ఆర్ఎంసీ నివేదికలో పొందపరచాలంటూ తెలంగాణ బోర్డుకు లేఖ..
ఈ క్రమంలోనే రివైజ్డ్ రూల్ కర్వ్స్ రూప కల్పనకు ఏ ప్రమాణాలను అనుసరించారని, ప్రామాణికతలు ఏంటో తెలియజేయాలంటూ కృష్మా బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ పలు రేఖలు రాశారు. గతంలోనూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కేటాయింపులు ఏ ఒప్పందాలు, ప్రమాణాల మేరకు నిర్వహిస్తున్నారో ఆధారాలు అందజేయాలని తెలంగాణ కోరింది. ఇందులో భాగంగానే శ్రీశైలం ప్రాజెక్టు పరిధికి సంబంధించి అతర్రాష్ట్ర ఒప్పందాలు, కేడబ్ల్యూడీటీ-1 అవార్డు తదితర ఒప్పందాల్లో స్పష్టం చేస్తున్న రూల్ కర్వ్స్ ను ఆర్ఎంసీ నివేదికలో పొందు పరచాలని తెలియజేస్తూ.. తాజాగా తెలంగాణ బోర్డుకు లేఖ రాసింది.
దీంతో పాటు తమ వద్ద రూల్ కర్వ్స్ పై ఇప్పటికే తెలంగాణ పలు అభ్యంతరాలను లేవనెత్తుతుండగా.. వాటిని నివృత్తి చేయకుండానే ముసాయిదా నివేదిక ఆమోదానికి ఆర్ఎంసీ సమావేశం నిర్వహిస్తే ఫలితం ఉండదని పేర్కొంది. దీంతో స్పందించిన సీడబ్ల్యూసీ తన వద్ద ఉన్న టీఏసీ-58వ సమావేశం నివేదికను తెలంగాణకు పంపినట్లు సమాచారం. ఈనెల 13వ తేదీన ఆర్ఎంసీ కీలక సమావేశం నిర్వహించబోతున్న విషయం అందరికీ తెలిసిందే.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి వివరాలు..!
శ్రీశైలం ప్రాజెక్టు ఏపీలోని కృష్ణా నదిపై నిర్మించిన భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు. కేవలం జలవిద్యుత్తు ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు, తర్వాత కాలంలో నీటిపారుదల అవసరాలను కూడా చేర్చడంతో బహుళార్థసాధక ప్రాజెక్టుగా మారింది. తరువాత కాలంలో ప్రాజెక్టు పేరును నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టుగా మార్చారు. 2009 అక్టోబరు 2న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి ప్రవేశించింది. భారీ వరదనీటితో ప్రాజెక్టు సామర్థ్యం కంటే 10 అడుగులపై నుంచి నీరు ప్రవహించింది.
శ్రీశైలం డ్యామ్ మొత్తం పొడవు 512 మీటర్లు కాగా.. క్రెస్టు గేట్ల సంఖ్య 12. జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 263 టీఎంసీలు. ఇందులో వాడుకోగలిగే నీరు 223 టీఎంసీలు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 770 మెగావాట్లు కాగా... యూనిట్ల సంఖ్య 7x110 మెగావాట్లు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం భూగర్భంలో నిర్మించబడింది. జపాన్ ఆర్థిక సాయంతో నిర్మించిన బడిన ఈ కేంద్రం దేశంలోనే అరుదైనదిగా చెప్పుకుంటారు. మెగా ఉత్పత్తి సామర్థ్యం 900 మెగా వాట్లు కాగా.. యూనిట్ల సంఖ్య 6x150 మెగావాట్లు.