YS Sharmila : లోటస్ పాండ్ టు ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వయా సోమాజిగూడ - షర్మిల అరెస్ట్ ఎపిసోడ్‌లో క్షణక్షణం ఏం జరిగిందంటే ?
కారులోనే కూర్చుని నిరసన తెలుపుతున్న షర్మిలను బలవంతంగా కారు దింపి అరెస్ట్ చేశారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. ఆమెపై మూడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
YS Sharmila : వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రగతిభవన్ ముట్టడికి కారులో వెళ్తున్న ఆమెను పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ్నుంచి అసలు డ్రామా ప్రారంభమైంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో ధ్వంసమైన కారులోనే ఆమె ప్రగతి భవన్‌కు బయలుదేరారు. ఆమెతో పాటు దాడిలో ధ్వంసం అయిన కారవాన్‌ను కూడా ప్రగతి భవన్‌వైపు తీసుకొచ్చారు. అయితే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లేందుకు కానీ.. కారు దిగేందుకు కానీ ఆమె అంగీకరించలేదు. దాంతో షర్మిల కార్లో ఉండగానే క్రేన్ సహాయంతో ఆమె కారును ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ వరకు లాక్కెళ్లారు.
షర్మిలపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఆమె కారు దిగడానికి నిరాకరించారు. దాంతో పోలీసులు బలవంతంగా ఆమెను కారు నుంచి దింపి స్టేషన్‌లోకి తీసుకెళ్లారు. వీఐపీ జోన్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు మూడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి గా అభివర్ణించిన షర్మిల
పోలీసుల వైఖరిపై వైఎస్సార్ టీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నది నాయకులు కార్యకర్తలు కాదు.. గూండాలని అన్నారు. ఉద్యమకారుల్ని పార్టీ నుంచి వెళ్లగొట్టి గూండాల పార్టీలా మార్చారని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని మండిపడ్డారు. పోలీసులు కూడా గూండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లేని సమస్యను సృష్టించి తనను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తనవల్ల ట్రాఫిక్ జాం కాలేదన్న ఆమె.. టీఆర్ఎస్ కార్యకర్తలు తగులబెట్టిన బస్సు కేసీఆర్ చూడాలనే దాన్ని ప్రగతి భవన్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశామని చెప్పారు. పోలీసు వాహనాల వల్ల ట్రాఫిక్ జాం అయిందే తప్ప తమ వల్ల కాదని స్పష్టం చేశారు. ప్ర తన వాహనానికి నిప్పు పెట్టి, మరికొన్నింటి అద్దాలు పగలగొట్టిన దుండగుల్ని వదిలేసి తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని షర్మిల నిలదీశారు. తనపై గూండాల్లా దాడి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
పోలీసులకు కనిపించకుండా లోటస్ పాండ్ నుంచి బయటకు వచ్చిన షర్మిల
అంతకు ముందు లోటస్ పాండ్ లోని షర్మిల నివాసం వద్ద హైడ్రామా జరిగింది. ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో షర్మిల బయటకు రాకుండా ఆమె ఇంటి బయట భారీగా పోలీసులు మోహరించారు. ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల కళ్లుగప్పిన షర్మిల వారికి తెలియకుండా సోమాజిగూడకు చేరుకున్నారు.
సోమవారం ఉద్రిక్త పరిస్థితులతో షర్మిలను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించిన పోలీసులు
సోమవారం వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఆమె ప్రయాణించే బస్సుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కాన్వాయ్‍లోని వాహనాలపై రాళ్లదాడికి దిగారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కూడా నిప్పుపెట్టారు. పాదయాత్ర కోసం ఊరురా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలను ఎక్కడికక్కడ తగలబెట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి పోలీసులు షర్మిల యాత్రకు అనుమతి నిరాకరించారు. ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో హైదరాబాద్ తరలించారు. దీంతో ఆదివారం 3,500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న షర్మిల పాదయాత్రకు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం శంకరమ్మ తండా వద్ద బ్రేక్ పడింది.