Rains Alert: దేశమంతటా విస్తరించిన రుతుపవనాలు- నేడు ఏపీ, తెలంగాణలో ఆ జిల్లాల్లో వర్షాలు
AP Rains | భారతదేశంలో నైరుతి రుతుపవనాలు జూన్ 29 నాటికి దేశమంతా విస్తరించాయి. ఇకనుంచి అన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

Rains in India | ఈ సంవత్సరం భారతదేశంలో నైరుతి రుతుపవనాలు వేగంగా వచ్చాయి. జూన్ 29, 2025 నాటికి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా జూలై 8కి కాస్త అటుఇటుగా రుతుపవనాలు దేశం మొత్తం వ్యాపించేకంటే కంటే తొమ్మిది రోజుల ముందే కావడం విశేషం.
ఈ రుతుపవనాల రాకతో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ, తూర్పు రాష్ట్రాల్లో వరదలు వస్తున్నాయి. రుతుపవనాలు ఈ ఏడాది మొదట మే 24న కేరళలో ప్రవేశించాయి. సాధారణం కంటే ఒక వారం ముందుగా కేరళను తాకాయి. అక్కడి నుంచి ఉత్తరం వైపు వేగంగా విస్తరించాయి, మే 26 నాటికి ముంబైకి చేరుకున్నాయి. గత 25 సంవత్సరాలలో ముంబైకి రుతుపవనాలు ఈ ఏడాది వేగంగా వచ్చాయి. సాధారణంగా 10 నుంచి 11 రోజులు పట్టేది. ఈ ఏడాది కేవలం రెండు రోజుల్లోనే కేరళ నుంచి ముంబైని తాకాయి.
అధికారికంగా రుతుపవనాలు రాకముందే, భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో మే నెలలో భారీ వర్షాలు కురిశాయి. మధ్యధరా ప్రాంతం నుంచి వచ్చే తుఫాను సాధారణంగా మే నెలలో ఒకటి లేదా రెండుసార్లు వస్తాయి. కానీ ఈ సంవత్సరం IMD డేటా ప్రకారం ఐదు నుంచి ఏడుసార్లు వచ్చాయి. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురిశాయి.
జూన్ ప్రారంభంలో ఈశాన్య రాష్ట్రాలపై ప్రభావం
రుతుపవనాలు త్వరగా బలపడటంతో, ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. మే చివరి నుంచి జూన్ వరకు ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో వరదలు వచ్చాయి. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. మానవతా నెట్‌వర్క్ స్పియర్ ఇండియా నివేదిక ప్రకారం, కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 15,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.
వర్షపాతం, వాతావరణ వ్యవస్థలు
గత 24 గంటల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అండమాన్ & నికోబార్ దీవులు, పంజాబ్, హర్యానా, పశ్చిమ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కేరళ, బీహార్, గుజరాత్ మరియు మహారాష్ట్రలలో గంటకు 40–70 కిమీ వేగంతో గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.
7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :29-06-2025@TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather @Indiametdept pic.twitter.com/plFwWePcYc
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) June 29, 2025
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో రెండు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటలకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి.
ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.






















