Minister KTR : తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని మరోసారి రుజువైంది - మంత్రి కేటీఆర్
Minister KTR : సిరిసిల్ల సెస్ ఎన్నికల ఫలితాలతో బీజేపీ మరోసారి ప్రజలు తిరస్కరించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. అడ్డదారుల్లో గెలుపు కోసం బీజేపీ చేసిన కుటిల ప్రయత్నాలకు ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారన్నారు.
Minister KTR : బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో గెలువలేకపోయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మరోసారి తెలంగాణ ప్రజల తిరస్కారానికి బీజేపీ గురైందన్నారు. సెస్ ఎన్నికల్లో అడ్డదారిన గెలిచేందుకు బీజేపీ సాధారణ ఎన్నికల మాదిరి అన్ని ప్రయత్నాలు చేసిందని విమర్శించారు. అయితే బీజేపీ కుటిల ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించి, తమ ఓటుతో బుద్ధి చెప్పారని కేటీఆర్ అన్నారు. బీజేపీ విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని సంపూర్ణంగా ప్రవేటీకరించి, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్రలకు ఇది ఒక గుణపాఠంగా మారుతుందన్నారు. బీజేపీ విద్యుత్ సంస్కరణల పేరిట చేస్తున్న కుట్రలపై ప్రజలకు సైతం అవగాహన ఉందన్నారు. అందుకే సెస్ ఎన్నికల్లో ఆ పార్టీని తిరస్కరించినట్లు కేటీఆర్ అన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థ సెస్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మోటార్లకి మీటర్లు వస్తాయని, ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందని, సబ్సిడీ విద్యుత్తు సౌకర్యం ఉండదని ప్రజలు భావించారన్నారు. అందుకే బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించారని కేటీఆర్ అన్నారు.
I wholeheartedly thank the voters of my district Rajanna Siricilla for giving the @BRSparty candidates absolutely brilliant victory in the CESS election held across 13 mandals and 2 Municipalities
— KTR (@KTRTRS) December 26, 2022
Grateful for reposing the trust in leadership of Sri KCR Garu yet again 🙏 pic.twitter.com/5o31BjTU6r
తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు
బీజేపీ సెస్ ఎన్నికల్లో గెలిచేందుకు భారీ ఎత్తున డబ్బులు పంచిదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. సాధారణ ఎన్నికల మాదిరి విచ్చలవిడిగా అన్ని రకాల అడ్డదారులు తొక్కిందని ఆరోపించారపు. అనేక ప్రలోభాలకు తెరలేపినా, ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వెంటే నిలిచి సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు. సెస్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి, తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం బీజేపీపై తీవ్రమైన వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. తెలంగాణలో బీజేపీ స్థానం లేదని మరోసారి రుజువైందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు అనేక ఎన్నికల్లో బీజేపీ తిరస్కరిస్తూ వస్తున్నారని కేటీఆర్ అన్నారు. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై తెలంగాణ ప్రజలకు ఉన్న అపూర్వమైన నమ్మకానికి ఈ విజయం నిదర్శనం అన్నారు. తమ ప్రభుత్వం రైతన్నలు, నేతన్నలు, దళిత, గిరిజనులకు, కుల వృత్తులకు అందిస్తున్న విద్యుత్ సంక్షేమ కార్యక్రమాలకు వారిచ్చిన జనామోదం అని కేటీఆర్ అన్నారు.
బాధ్యత మరింత పెరిగింది
ఈ ఎన్నికల విజయంతో బీఆర్ఎస్ నాయకత్వంపై, ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ గెలుపుతో ఉప్పొంగిపోకుండా సెస్ పరిధిలో మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు పై దృష్టి పెడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమం, అభివృద్ధి అంశాలతో కూడిన సంతులిత విధానానికి ప్రజల నుంచి దక్కిన ఆమోదంగా భావిస్తున్నామన్నారు. ఒకవైపు రైతులు, కుల వృత్తులకు, దళిత, గిరిజనులకు రాయితీలు, ఇస్తూ మరోవైపు అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. దీంతోపాటు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భారీగా మౌలిక వసతుల కల్పన, విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ మంత్రి కేటీఆర్ మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు నాయకులకు పార్టీ తరఫున కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.