Singareni Workers Protest: మోదీ హటావో - సింగరేణి బచావో, బీఆర్‌ఎస్ శ్రేణుల మహాధర్నా
Singareni Workers Protest: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు మహాధర్నా చేస్తున్నారు. మోదీ హటావో.. సింగరేణి బచావో నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
Singareni Workers Protest: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు మహా ధర్నా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ సింగరేణి ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. మోదీ హటావో, సింగరేణి బచావో నినాదాలతో నిరసనలు చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు మహాధర్నా చేపట్టారు. భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల, గోదావరిఖని, రామగుండం, మందమర్రి, నస్పూర్, ఇల్లందులో కార్మికులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని సీసీసీ కార్నర్ వద్ద మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా చేశారు. ఈ మహాధర్నాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తుందని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణిపై కేంద్రం కక్ష గట్టింది..!
ఇప్పటికే పలుమార్లు గనుల వేలం ప్రక్రియ ప్రయత్నం చేసిన ప్రైవేటు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదని, మరోవైపు ఇవే గనులని నేరుగా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర థర్మల్ పవర్ జనరేషన్ లో సింగరేణి పాత్ర అత్యంత కీలకమైనదని, దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు, గృహ అవసరాలకు 24 గంటల పాటు ఇస్తున్న నాణ్యమైన విద్యుత్ సరఫరాను అడ్డుకోవాలన్న దురాలోచనతోనే కేంద్రం సింగరేణిపై కక్ష కట్టిందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే జంగ్ సైరన్ మోగిస్తామని... మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని హెచ్చరించారు. మహాధర్నాలో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్, ఆత్రం సక్కు,దుర్గం చిన్నయ్య, జడ్పీ చైర్ పర్సన్లు నల్లాల భాగ్యలక్ష్మి, కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు అరవింద్, నల్లాల ఓదెలు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఇన్చార్జ్ నారదాసు లక్ష్మణరావ్, గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ కుమార్, టీబీజీకేఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గోదావరిఖనిలో టీబీజీకేఎస్ నేత కెంగర్ల మల్లయ్య ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ లపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భూపాలపల్లి నిర్వహిస్తున్న ధర్నాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు పాల్గొన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్ర సర్కారు యత్నిస్తోందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ ఆపే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కొత్తగూడెంలో నిర్వహించిన ధర్నాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు వనమా, సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, రాములు నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. మోదీ హటావో, సింగరేణి బచావో అంటూ నినదించారు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తెలిపారు.