BRS MLA Candidates First List : బీఆర్ఎస్ టిక్కట్లు చేజార్చుకున్న ఆ ఏడుగురు చేసిన తప్పులేంటి ?
ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ టిక్కెట్లను కోల్పోయారు. వారు చేసిన తప్పులేమిటంటే ?
BRS MLA Candidates First List : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 115 మందికి టిక్కెట్లు ఖరారు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఏడుగురికి మాత్రమే టిక్కెట్లు నిరాకరించారు. వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఉప్పల్, బోథ్, స్టేషన్ ఘనపూర్, వైరా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మర్పులు చేశారు. వీరికి ఎందుకు టిక్కెట్లు నిరాకరించారంటే..?
వేములవాడ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు టిక్కెట్ నిరాకరించారు. దీనికి ప్రధన కారణంగా ఆయన పౌరసత్వ వివాదం అనుకోవచ్చు. ఆయన భారతీయ పౌరసత్వంపై కేసు ఇంకా కోర్టుల్లో ఉంది. అదే సమయంలో ఆయన జర్మనీలోనే ఎక్కవ సమయం గడుపుతూంటారు. దీంతో వేములవాడలో పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండరు. దీంతో పార్టీ నేతల్లో అసంతృప్తి పెరిగిపోయింది. దీంతో ఇటీవల పార్టీలో చేరిన చల్మెడ ఆనందరావుకు టిక్కెట్ ఖరారు చేశారు.
ఖానాపూర్ : రెండు సార్లు బీఆర్ఎస్ తరపున విజయం సాధించిన రేఖానాయక్ కు ఈ సారి మొండి చేయి చూపారు. కొంత కాలంగా నియోజకవర్గంలో పని చేసుకుంటున్న మంత్రి కేటీఆర్ స్నేహితుడు, ఎన్నారై జాన్సన్ నాయక్ కు టిక్కెట్ ఖరారయింది. రేఖా నాయక్ నిత్యం వివాదాలతో సావాసం చేస్తున్నారని.. తన వ్యవహారశైలితో సొంత పార్టీ నేతలనూ దూరం చేసుకున్నారని.. ఈ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా ఫలితం లేదని అధిష్టానం పార్టీ టిక్కెట్ నిరాకరించిందని భావిస్తున్నారు.
అసిఫాబాద్ : ఆసిఫాబాద్ టికెట్ ను కోవా లక్ష్మీకి కేటాయించారు. గత ఎన్నికల్లో కోవా లక్ష్మి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు చేతిలో ఓడిపోయారు. తర్వతా ఆత్రం సక్కు బీఆర్ఎస్ లో చేరారు. అయితే ఈ సారి కూడా ఎమ్మెల్యే టిక్కెట్ ను కోవా లక్ష్మికే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ ఎంపీ టిక్కెట్ ఇస్తామని చెప్పినట్లుగా సమాచారం.
బోథ్ : బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. ఆయన స్థానంలో నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ కు చోటు దక్ంది. బాపూరావుపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
స్టేషన్ ఘనపూర్ : వివాదాస్పదంగా మారిన స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజయ్యను తప్పించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు కాకుండా ... కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు. రాజయ్య 1997లో కాంగ్రెస్ పార్టీతో రాజకీయారంగేట్రం చేశాడు. 1999లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో ఓటమి పాలయ్యారు. 2008 ఉప ఎన్నికల్లో కూడా ఓటమి చవిచూశారు. మూడో సారి 2009లో జరిగిన ఎన్నికల్లో రాజయ్య గెలుపొందారు. 2012లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన లక్షంగా కాంగ్రెస్ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పటి తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. అప్పట్నుంచి బీఆర్ెస్ తరపున వరుసగా గెలుస్తూ వస్తున్నారు.
ఉప్పల్ : ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి టిక్కెట్ నిరాకరించారు. ఆయనకు బదులుగా కాంగ్రెస్ నుంచి వచ్చి పార్టీలో చేరిన బండారి లక్ష్మారెడ్డికి టిక్కెట్ కేటాయించారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సహా చాలా మంది ప్రయత్నించారు. కానీ.. కేసీఆర్ బండారి లక్ష్మారెడ్డి వైపే మొగ్గారు. అవినీతి ఆరోపణలు, ప్రజల్లో వ్యతిేకత కారణంగా భేతి సుభాష్ రెడ్డికి టిక్కెట్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది.
వైరా : ఖమ్మం జిల్లా వైరా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ కు కేసీఆర్ టిక్కెట్ నిరాకరించారు. వైరా నియోజకవర్గంలో రాములు నాయక్పై సొంత పార్టీ నేతల నుంచి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాములు నాయక్‌కు బదులుగా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గు చూపారు. సర్వేలు రాములుకు వ్యతిరేకంగా ఉన్నాయని టిక్కెట్ నిరాకరించారు.