MLA Jagga Reddy: సీఎం అవ్వాలనుంది, ఇంకో పదేళ్లలో ముఖ్యమంత్రి అవుతా - జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
దసరా ఉత్సవాలను సంగారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించగా, ఆ వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్న అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని మనసులో మాట బయట పెట్టారు. ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకో పది సంవత్సరాల్లో తాను సీఎం అవుతానని అన్నారు. దసరా ఉత్సవాలను సంగారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించగా, ఆ వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్న అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. విజయదశమి నాడు తన మనసులో మాట చెబుతున్నానని అన్నారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని.. దీన్ని ఎవరైనా కాదనగలరా అని ఆయన వ్యాఖ్యలు చేశారు.
ఈ కాలం ఎప్పుడు నిర్ణయించినా.. తాను మాత్రం కచ్చితంగా సీఎం అవుతానని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ వల్ల తన నోరు, చేతులు కట్టి పడేసినట్లు అయిందని, లేదంటే మరిన్ని విషయాలను చెప్పే వాడినని జగ్గారెడ్డి అన్నారు. తాను ఎల్లప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో తాను అందుబాటులో ఉన్నా, లేకపోయినా.. తన భార్యతో పాటు అనుచరులు ఉంటారని చెప్పారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడికి వెళ్లిపోతానని అన్నారు. ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ తనపై ఉండాలని జగ్గారెడ్డి కోరారు.
కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎం అభ్యర్థి అంటూ ఇప్పటిదాకా ముఖ్యనేతలు అందరూ ప్రకటించుకుంటున్నారు. కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎం అవుతానంటూ ఇటీవల మాజీ మంత్రి జానారెడ్డి కూడా చెప్పుకున్నారు. సీఎం పదవి చేపట్టే అవకాశం వస్తే వదులుకోనని, కాంగ్రెస్ పార్టీకి తాను ఎన్నో సేవలు అందించానని అన్నారు.