Revanth Reddy : రేవంత్ ఢిల్లీ పర్యటన క్యాన్సిల్ - హైకమాండ్‌తో సమావేశం కానున్న భట్టి విక్రమార్క !
Telangana Congress : పార్లమెంట్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఢిల్లీలో జరగాల్సిన సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలపై తన అభిప్రాయాలను రేవంత్ హైకమాండ్‌కు చెప్పారు.
Revanth Reddy Delhi Tour Cancel : పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించేందుకు పార్టీ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు సమన్వయకర్తలను సమీక్షల కోసం ఢిల్లీకి ఆహ్వానించింది. .ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే పలు కారణాల వలన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రద్దు అయింది.దీంతో మొట్టమొదటి పార్లమెంట్ సమీక్షా సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి దూరం అయ్యారు. పార్లమెంటు ఎన్నికలపై తన అభిప్రాయాన్ని అధిష్టానానికి ఇప్పటికే తెలిపినందున రేవంత్ ఢిల్లీ పర్యటన రద్దు అయినట్లుగా తెలు్సతోంది. సీఎం షెడ్యూల్ లో సైతం ఢిల్లీ టూర్ లేదంటున్న సీఎంఓ వర్గాలు ప్రకటించాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశంపై కూడా ఇప్పటికే అధిష్టానంతో చర్చించి అనుమతి తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
లోక్ సభ ఎన్నికలపై పార్టీ ఫోకస్ పెట్టింది. తెలంగాణలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలువాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో.. పార్టీ ముఖ్య నేతలు తీవ్రంగా పాటుపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ మంత్రులు కొందరు ఢిల్లీకి వెళ్లారు. లోక్ సభ ఎన్నికల సన్నద్ధత సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల అంశంపై చర్చించనున్నారు. లోక్ సభ స్థానాల్లో విజయం కోసం ఎలా చేయాలన్న దానిపై తెలంగాణ మంత్రులకు రాహుల్ గాంధీ, ఖర్గే సూచించనున్నారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వంటి నేతలు చేరుకున్నారు.
రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ పెద్దలు రాష్ట్రనేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే టిక్కెట్ ఆశిస్తున్నవాళ్ల జాబితాను అధిష్టానం ముందు ఇప్పటికే ఉంచారు సీఎం రేవంత్ రెడ్డి. అభ్యర్థుల్ని పరిశీలించి అధిష్టానం తన నిర్ణయం ప్రకటిస్తుంది. ఈనెల 15న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. తిరిగి వచ్చాక లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వకర్తలతో సమీక్షలు నిర్వహిస్తారని సమాచారం.
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను రేవంత్ రెడ్డి హైకమాండ్ కు పంపించారు. తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు అద్దంకి దయాకర్ పేరును ఎమ్మెల్సీ లుగా ఖరారు చేయాలని సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మైనార్టీ నాయకులకు అవకాశం కల్పించాలని హైకమాండ్ అనుకుంటే.. ఫిరోజ్‌ఖాన్, షబ్బీర్ అలీ పేర్లను పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పేర్లను రేవంత్ హైకమాండ్ కు పంపినందున.. వారి నిర్ణయం మేరకే.. నామినేషన్లు వేయనున్నారు.