Addanki Dayakar Interview: మంత్రి పదవిపై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు! రేవంత్ రెడ్డికి చెడ్డపేరు వస్తుందా?
MLC Addanki Dayakar With ABP Desam | రానున్న రోజుల్లో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగవచ్చని, తనకు క్యాబినెట్‌లో స్థానం కల్పించే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.

రానున్న రోజుల్లో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగవచ్చని, తనకు క్యాబినెట్‌లో స్థానం కల్పించే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. తనక మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం రేవంత్ రెడ్డికి సైతం చెడ్డపేరు రావచ్చని అభిప్రాయపడ్డారు సమకాలీన రాజకీయాలతో పాటు, తెలంగాణ ఉద్యమ అనుభవాలు, తాను హీరోగా నటిస్తున్న సినిమా విశేషాలను ఏబీపీ దేశం ఇన్ పుట్ ఎడిటర్ వై.సుధాకర్ రావుతో పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇదే...
ప్రశ్న – మీరు తెలంగాణ మాల మహానాడు సంఘం అధ్యక్షుడిగానూ, తెలంగాణ ఉద్యమకారుడిగానూ పనిచేశారు. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీగా ఉన్నారు. దీంతో పాటు సినిమా హీరోగా నటిస్తున్నారు. మీకు బాగా సంతృప్తినిచ్చిన రంగం ఏంటి?
జవాబు – సామాజిక వర్గ అభివృద్ధికి పని చేశాను, తెలంగాణ ఉద్యమం సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం పని చేశాను. తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనడం బాగా సంతృప్తి కలిగింది.
ప్రశ్న – తెలంగాణ మాల మహానాడు సంఘం ద్వారా చేసిన ఉద్యమ ఫలితాలు ఏంటి?
జవాబు – కులం మార్ఖత్వం వైపు పోకుండా, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడాల్సి ఉంది. తెలంగాణ ఉద్యమంలో మాల మహానాడు అధ్యక్షుడిగా, తెలంగాణ ఐకాసలో పని చేశాను. తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి మాల మహానాడు సంఘం ఓ చోదక శక్తిగా పనిచేసింది. అదే నాకు దక్కిన ఫలితం. ఇప్పుడు మాల మహానాడు ద్వారా జాతీయ స్థాయిలో పని చేస్తున్నాం. నాలుగైదు రాష్ట్రాలకు విస్తరిస్తున్నాం. జాతీయ స్థాయిలో సామాజిక అంశాలపై పోరాడుతున్నాం. నవంబర్ 26న కొత్త ఎజెండాను రూపొందించాం. రిజర్వేషన్లు పెంపు, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల పెంపు, కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ పెట్టాలని, చట్ట సభల్లో రిజర్వేషన్లు వంటి వాటితో పాటు అంబేద్కర్ లక్ష్యాలను మరిన్ని సాధించడానికి కృషి చేస్తున్నాం.
ప్రశ్న – తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడిగా వర్గీకరణపై మీ అభిప్రాయం ఏంటి? మాదిగలకు అన్యాయం జరిగిందా?
జవాబు – నేను దీని విషయంలో ఐడల్‌గా ఉన్నాను. మాదిగ దండోరా మీటింగ్‌కు వెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని కోరాను. వర్గీకరణ విషయంలో నా సంఘం వ్యతిరేకించింది. నేను మాత్రం వ్యతిరేకించలేదు. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ వైఖరికి కట్టుబడాల్సి ఉంది. నేను పార్టీ స్పోక్స్‌పర్సన్. అందుకే వర్గీకరణపై మాట్లాడదలచుకోలేదు. తెలంగాణ నిజాం పాలనలో ఉంది, ఏపీ బ్రిటిషర్స్ పాలనలో ఉంది. ఇక్కడ మాదిగలు ఎక్కువ. అక్కడ మాలలు ఎక్కువ. ఏపీలో మాలలు కొంత అభివృద్ధి చెందారు. తెలంగాణలో మాదిగలు, మాలలు వెనుకబడి ఉన్నారు. ఈ ఉద్యమాలను రాజకీయంగా రాజకీయ పార్టీలు వినియోగించుకుంటున్నాయి. అందుకే జనాభా ప్రాతిపదికన అభివృద్ధి సాధించాలన్నది నా అభిప్రాయం.
ప్రశ్న – సామాజిక, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నారు. సినిమాలపై ఆసక్తి ఎలా పెరిగింది?
జవాబు – సమకాలీన రాజకీయాలను సినిమాగా చేస్తే ఎలా ఉంటుందని బొమ్మకు మురళి ఆలోచించారు. ఆయనే ఓ పొలిటికల్ లీడర్‌ను హీరోగా తీసుకోవాలనుకున్నారు. కన్నయ్య కుమార్, ఆజాద్, జిఘ్నేష్ వంటి వాళ్ల పేర్లను పరిశీలించారు. తర్వాత ఆ లక్షణాలతో ఉన్న నన్ను ఆ పాత్రకు ఎంపిక చేశారు. సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు ఉంటాయి. చరిత్రలో దళితుల పట్ల వివక్ష ఎలా వచ్చింది అన్న విషయాలను తెలుసుకోవడం వంటి అంశాలు ఇందులో ఉంటాయి. దీనికి ఇండియా ఫైల్స్గా పేరు పెట్టారు. జనవరి, ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా విడుదల అవుతుంది. ఆరు భాషల్లో విడుదల అవుతుంది.
ప్రశ్న – సినిమాల్లో కొనసాగుతారా.. ఇదే చివరి సినిమానా?
జవాబు – మంచి చారిత్రాత్మక కథలు వస్తే నటించేందుకు సిద్ధం. భీమ్ - బోస్ అనే సినిమా ఆలోచన ఉంది. ప్రస్తుత రాజకీయాల కారణంగా దీనిపై ఇంకా ఫోకస్ చేయలేదు. ఈ స్టోరీ బాగుంటుంది. అంబేద్కర్ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఇంగ్లండ్ పక్షాన ఉంటారు. బోస్ జపాన్ దేశం పక్షాన ఉంటారు.
ప్రశ్న – తెలంగాణ ఉద్యమంలో మీకు గుర్తిండిపోయే సంఘటన, మీరు ప్లాన్ చేసి, ఎగ్జిక్యూట్ చేసిన కార్యాచరణ ఏంటి?
జవాబు – ఉద్యమ సమయంలో రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని అడ్డుకోవడం ముఖ్యమైన సంఘటన. విమానాశ్రయంలో దిగాక మా కార్యకర్తలు అడ్డుకున్నారు. తర్వాత గన్ పార్క్ వద్ద కార్యకర్తలు అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్ అడ్డుకోలేదు, వీరు ఎవరు అడ్డుకుంటున్నారని అప్పటి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ కేకేను ప్రణబ్ ముఖర్జీ అడిగారు. ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది అద్దంకి దయాకర్ అని అతను తెలంగాణ ఉద్యమ నేత అని కేకే చెప్పారు. మీరు చెబితే వినరా, జేఏసీ, కేసీఆర్ చెబితే వినరా అని ఆయన అడిగారు. ఎవరు చెప్పినా వినరని, ఆయన ఐకాసలో ఉన్నా వినడని కేకే చెప్పడం జరిగింది. పోలీసులు సైతం ఈ కార్యాచరణతో ఇబ్బంది పడ్డారు. దీంతో మా సంఘానికి, నాకు గుర్తింపు వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో మంచి సంఘటనగా మిగిలిపోయింది. ప్రజల్లో, ఉద్యమ కార్యకర్తల్లో చాలా పాజిటీవ్‌గా ఇది నిలిచింది. మిలియన్ మార్చ్ విజయంలో నుండి ఈ వ్యూహం పుట్టుకొచ్చింది.
ప్రశ్న – కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి ప్రధాన కారణం ఏంటి?
జవాబు – తెలంగాణ ఇచ్చాక సోనియా గాంధీ నన్ను ప్రత్యేకంగా కాంగ్రెస్‌లోకి రమ్మని ఆహ్వానించారు. నాతో పాటు మరికొందరు జేఏసీ నేతలను ఆహ్వానించారు. దిగ్విజయ్ సింగ్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌కు వచ్చినప్పుడు రాజకీయాల్లోకి ఎవరు రావాలనుకుంటున్నారని అడిగారు. అప్పుడు నా పేరు ఇచ్చాను. నేను కేసీఆర్‌ను కాంగ్రెస్‌లోకి తేవాలని ప్రయత్నించాను. వారి కుటుంబ సభ్యులను తీసుకురావాలనుకున్నాను. సీఎం, పీసీసీ చీఫ్ వంటి పదవులను కేసీఆర్ కోరుకున్నారు. దీంతో వారు కాంగ్రెస్‌లోకి రావడం సాధ్యం కాలేదు.
ప్రశ్న – కాంగ్రెస్‌లో టికెట్ ఎలా ఇచ్చారు?
జవాబు – నాకు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ రావడానికి కారణం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే కారణం. తొలి సారి సోనియా గాంధీ ఢిల్లీ పిలిపించి నాకు మాట ఇచ్చినందుకు రేపు ఎన్నికలు అనగా రాత్రి బీఫాం ఇచ్చారు. కానీ తక్కువ ఓట్లతో ఓడిపోయాను. రెండో సారి నేను టికెట్ కోసం ప్రయత్నించలేదు. దాంతో రాహుల్ గాంధీనే పిలిపించి నువ్వు ఎందుకు పోటీ చేయడం లేదని అడిగారు. ఎంపీగా పోటీ చేస్తావా అన్నారు. ఏది ఇస్తే దానికి కట్టుబడి ఉంటా అన్నాను. అయినా రాహుల్ గాంధీనే పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. తక్కువ ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది.
ప్రశ్న – మూడో సారి ఎందుకు మీకు టికెట్ దక్కలేదు?
జవాబు – మూడో సారి కోమటిరెడ్డి బ్రదర్స్ కోటాలో టికెట్ వేరే వారికి ఇవ్వడం జరిగింది.
ప్రశ్న – పరుషంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మాట్లాడటం వల్లే టికెట్ దక్కలేదు నిజమేనా?
జవాబు – అదేం లేదు... రెండు సార్లు టికెట్ ఇచ్చినప్పుడు వారు నాకు మద్దతు ఇచ్చారు. తక్కువ ఓట్లతో ఓడిపోయాను. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం వల్లే నేను పార్టీ లైన్‌లో మాట్లాడాల్సి వచ్చింది.
ప్రశ్న – పార్టీలో ఇప్పుడు మీకు గాడ్ ఫాదర్ ఎవరు?
జవాబు – రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చాక ఆయనతోనే ఉన్నా, ఆయన చెప్పినట్లే విన్నా. నాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రోల్ మోడల్స్. రేవంత్ రెడ్డితో ఉన్న వ్యక్తిగత అనుబంధం ఎక్కువ పోరాడే వరకు తీసుకెళ్లింది. రేవంత్ రెడ్డి నాకు ఏది ఇది చేయమని చెప్పరు. రాజగోపాల్ రెడ్డిపై నేను వ్యాఖ్యలు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా క్షమాపణలు చెప్పారు. దాంతో నేను కూడా క్షమాపణలు చెప్పాను. కోమటిరెడ్డి బ్రదర్స్‌తో సయోధ్య ఉంది.
ప్రశ్న – మంత్రుల మధ్య విభేదాలు, సీఎంపై మీ నేతల విమర్శలను ఎలా చూడాలి?
జవాబు – సుధాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇలా ఉండకపోతే ఎలా ఉంటుంది. మా పార్టీలో ప్రజాస్వామ్యం అలాగే ఉంటుంది. విమర్శల ఆధారంగా కూడా పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. పార్టీకి నష్టం జరుగుతుందంటేనే విమర్శలు చేసిన వారి నుండి వివరణ తీసుకోవడం ఉంటుంది. మా పార్టీలో విమర్శలుంటాయి. ఐక్యత ఉంటుంది.
ప్రశ్న – క్యాబినెట్‌లో మార్పులు ఉంటాయని చర్చ జరుగుతుంది నిజమేనా?
జవాబు – మార్పులు ఉండవచ్చు. ఉండాలి కూడా... పార్టీలో కూడా దీనిపై చర్చ జరిగినట్లు ముఖ్యమంత్రి గారే ఓ వేదికపైన అన్నారు.
ప్రశ్న – మీకు మంత్రిగా అవకాశం వస్తుందా?
జవాబు – క్యాబినెట్ మంత్రిగా నా పేరు ఎప్పుడూ ప్రచారంలోకి రాలేదు. ప్రతీ సారి నా పేరు కూడా చర్చకు వచ్చింది. గత విస్తరణ సందర్భంగా నేనా, వివేక్ వెంకటస్వామికా అన్న చర్చ మీడియాలో జరిగింది. నేను సీఎం గారిని అడగలేదు. కానీ అడిగితే కాదని అనలేరు. కానీ నేను అడగలేదు. మంత్రిగా నాకు అర్హత ఉంది. అయితే నేను మీనాక్షి నటరాజన్‌ను మాత్రం అడిగాను. ప్రతిపక్ష బీజేపీ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. వారిని ఎదుర్కోవాలంటే నా స్థాయి సరిపోదు కాబట్టి ఓ మంత్రిగా అవకాశం ఎందుకు ఇవ్వకూడదు అని అడిగాను. అందుకు ఆమె ఈ సారి కష్టం. విస్తరణ సమయంలో చూద్దాం అని అన్నారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం రేవంత్ రెడ్డికి కూడా కష్టమే. నాకు న్యాయం చేయలేదని సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
ప్రశ్న – కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేరవేర్చడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలకు మీ సమాధానం?
జవాబు – ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేరుస్తున్నాం. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అప్పుల భారం ఉంది. నిరుద్యోగ భృతి, కౌలు రైతులకు ఆర్థిక సాయం, మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలు ఉన్నాయి. ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తుంది. ఇక తులం బంగారం అనేది ఇవ్వలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు.
ప్రశ్న – బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పై కేసులు ఉన్నాయి. కక్ష సాధింపుగా అరెస్టు లాంటివి ఉంటాయా?
జవాబు – పోలీసులు తమ పని తాము చేస్తారు. ప్రభుత్వ జోక్యం ఉండదు. రేవంత్ రెడ్డి కక్ష సాధించాలంటే రెండేళ్లు ఎందుకు, మూడు రోజులు చాలదా అరెస్ట్ చేయడానికి?
ప్రశ్న – మీ వ్యూహంలో భాగంగానే కవితను వారి నుండి దూరం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందా? మీ పార్టీలోకి వస్తుందా?
జవాబు – పార్టీలో దయ్యాలున్నాయని కవిత ప్రశ్నించింది. సొంత చెల్లినే కాపాడుకోలేకపోయారు. ప్రజల్ని ఏం కాపాడుకుంటారు. ఆమె దయ్యాలు వెతికే పనిలో ఉంది. ఆమె తను సొంతంగా రాజకీయంగా ఎదగాలని ఆలోచిస్తుంది. మా పార్టీలోకి వస్తుందని అనుకోవడం లేదు. స్వతంత్రంగా ఉండవచ్చు.
ప్రశ్న – బీజేపీ మతం కార్డు తీస్తే, మీ పార్టీ కులం కార్డు తీసింది. కులం - మతం ముందు ఓడిపోతున్నట్లుంది కదా?
జవాబు – బీజేపీ ఏది తీసినా రానున్న రోజుల్లో ఓడిపోక తప్పదు. మతం కార్డు పని చేయడం లేదనే ఓట్ల చోరీకి దిగారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. ఇది చాలాదా మతం అనేది పని చేయడం లేదని. గత లోక్ సభ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. ప్రజలు తల్చుకుంటే బీజేపీని గద్దె దింపి ఇంట్లో కూర్చోబెడతారు. మోసంతో ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేరు.
ప్రశ్న – మోదీ - అమిత్ షా వంటి ఎన్నికల వ్యూహకర్తలు కాంగ్రెస్‌లో కరువయ్యారన్న విమర్శలు ఉన్నాయి.
జవాబు – మోదీని ఎదుర్కోనే శక్తి కేవలం రాహుల్ గాంధీకి మాత్రమే ఉంది. రాహుల్ ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వకుండా పారిపోతుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
ఇలా సమకాలీన రాజకీయాలు, సినిమా అంశాలు, భవిష్యత్తు రాజకీయాలపై ఏబీపీ దేశంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ అద్దంకి దయాకర్ విపులంగా మాట్లాడారు.





















