Revanth Reddy: పార్లమెంటులో వాళ్లదంతా ఉత్తుత్తి పోరాటం.. టీఆర్ఎస్, బీజేపీది కుమ్మక్కు రాజకీయం
టీఆర్ఎస్, బీజేపీపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై టీఆర్ఎస్ ఎంపీలు ఇంతవరకూ విపక్షాలను కలవలేదని విమర్శించారు.
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు.. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న విషయం అందరికీ అర్థమవుతుందని.. రేవంత్ రెడ్డి ఆరోపించారు. పంటను అమ్ముకునే దారి లేక రైతులు ఆత్మహత్యలకు చేసుకోవడం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కొడంగల్ పట్టణంలోని గాంధీనగర్లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా.. రేవంత్ రెడ్డి ఈ మేరకు కామెంట్స్ చేశారు. పార్లమెంటులో వాళ్లదంతా ఉత్తుత్తి పోరాటమని విమర్శించారు.
తెలంగాణలో సాగు చేసిన పంటను అమ్ముకోవడానికి.. రైతులు.. నానా ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తున్న విధానాలపై రైతులు ఆందోళన చెందుతున్నారని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొ్న్నారు. ఏ ప్రభుత్వమైనా రైతుల సమస్యలపై ప్రశ్నిస్తుందని.. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం.. పార్లమెంటులో నిరసన కార్యక్రమం పేరుతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు.
ఉరిమే ఉత్సాహం…
— Revanth Reddy (@revanth_anumula) December 9, 2021
కొడంగల్ లో సభ్యత్వ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా…#JoinCongressSaveIndia#CongressMembershipDriveTelangana pic.twitter.com/xMJSk8L7zT
పార్లమెంటులో రైతుల తరఫున పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. సభ నుంచి బయటకు రావడం దేనికి నిదర్శనమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు.. దేశంలోని అన్నీ ప్రతిపక్ష పార్టీల నేతలతో చర్చించి.. వరిసాగు విషయంలో పార్టీలను ఏకం చేసి.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరారు. ఎంపీలు తూతూ మంత్రంగా విచారణ చేపట్టి బయటకు రావడమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
సెప్టెంబర్ లో కేసీఆర్.. మోడీని కలిసి వచ్చిన తరువాత ఇంత వరకు ఏ కేంద్ర మంత్రి దగ్గర అపాయి మెంట్ తీసుకోలేదని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల వైఖరి కారణంగా… తెలంగాణ రైతులు చనిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో తెలంగాణలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణ రైతులు పండిస్తున్న వరి పంటను ముఖ్యమంత్రి సహాయ నిధితో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ వరి వద్దంటున్నారని.. ఇక్కడ కేసీఆర్ అదే చెబుతున్నారని ఫైర్ అయ్యారు.
Also Read: Suryapet: జడ్పీటీసీ హత్య కోసం భారీ కుట్ర.. భగ్నం చేసిన సూర్యాపేట పోలీసులు, వెలుగులోకి ఇలా..
Also Read: TSRTC: ఈ పిల్లలు జీవితాంతం బస్సుల్లో ఫ్రీగా తిరగొచ్చు.. ఎండీ సజ్జనార్ గ్రేట్ ఆఫర్, ఎందుకంటే..
Also Read: Petrol-Diesel Price, 9 December: నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో నేడు ఇలా..