Telangana Congress : ఎంపీ సీట్లలో బీసీలకే ప్రాధాన్యం - ప్రకటన చేసినట్లుగా రేవంత్ టిక్కెట్లు కేటాయించగలరా ?
Revanth : కాంగ్రెస్ ఎంపీ సీట్లలో బీసీలకు ప్రాధాన్యం కల్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఆశావహులు భారీగా ఉన్నందున అలా కేటాయింపు సాధ్యమేనా అన్న ప్రశ్న కాంగ్రెస్‌లో వినిపిస్తోంది.
Telangana Congress : లోక్‌సభ అభ్యర్థులపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం ఎంపీ టికెట్ల విషయంలో బీసీలకు ప్రాధాన్యమివ్వాలని సీఎం రేవంత్ చెప్పినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో కనీసం 5-6 సీట్లను బీసీలకు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గానికి 1-3 పేర్లను సిఫార్సు చేయాలని పీఈసీకి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచించినట్లు తెలిసింది. సామాజిక, గెలుపు సమీకరణాలను పరిగణలోకి తీసుకుని.. అభ్యర్థులను ఎంపిక చేయాలని అనుకుంటున్నారు.
జనరల్ సీట్లలో సగం బీసీలకు ఇవ్వాలనే ఆలోచన
ఎస్సీ రిజర్వ్ డ్ సెగ్మెంట్లలో 2 సీట్లు మాదిగలకు, 1 సీటు మాల సామాజికవర్గానికి కేటాయించాలని డిమాండ్లు వచ్చినట్లు తెలుస్తోంది. లోక్ సభ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో పాటు ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్న దూకడుతో ప్రజలు పట్టం కడతరాని కనీసం పదిహేను చోట్ల విజయం సాధిస్తామన్న నమ్మకంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే బీసీ నేతలకు ఎక్కువ అవకాశం కల్పించాలనుకుంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయిన కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్లమెంట్ నియోజకవర్గానికి కనీసం రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల సీట్ల సర్దుబాటు సమయంలో కేటాయించలేకపోయారు. బీఆర్ఎస్ పార్టీ కన్నా బీసీలకు తక్కువే సీట్లు కేటాయించారు. ఈ సారి బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలగా ఉన్నారు. మొత్తం పదిహేడు లోక్ సభ స్థానాల్లో హైదరాబాద్ ముస్లింలకు అప్రకటిత రిజర్వుు నియోజకవర్గంగా ఉంది. మరో మూడు స్థానాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. మరో రెండు స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. అంటే ఇక జనరల్ కేటగిరిలో పదకొండు స్థానాలు మాత్రమే ఉంటాయి.. వీటిలో ఐదారు అయినా బీసీలకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
బలమైన బీసీ అభ్యర్థుల కొరత
కానీ ఖమ్మం , నల్లగొండ, భువనగిరి, మల్కాజిగిరి, మేడ్చల్, మహబూబ్ నగర్ వంటి చోట్ల బలమైన అభ్యర్థులు .. టిక్కెట్ ఆశిస్తున్న వారంతా ఓసీ వర్గాలే. ఇక కరీంనగర్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఖరారు చేశారని అంటున్నారు. ఇక మెదక్, జహీరాబాద్, నిజామాబాద్ వంటి చోట్ల మాత్రమే బీసీలకు సీట్లు కేటాయించగలరు. ఈ లెక్కన బీసీలకు ఆరేడు సీట్లు కేటాయించడం . రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా సాధ్యం కాదని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.