Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ
ఆదిభట్లలో జరిగిన ఈ కిడ్నాప్ ఘటన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యువతి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు, ఇంటి ముందు నిలిపి ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేశారు.
Twist in the kidnapping case of a young woman in Adibatla: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. దాదాపు 100మంది ఒక్కసారిగా శుక్రవారం ఉదయం యువతి ఇంటిపై దాడి చేసి, ఆమెను కిడ్నాప్ చేశారు. ఈ దారుణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన యువతి తండ్రితో పాటు కొందరు బంధువులపై కర్రలు, రాడ్లతో దాడి చేసి వారిని గాయపరిచారు. యువతి తల్లిదండ్రులు గట్టిగా కేకలు వేయటంతో చుట్టుపక్కలవారు వచ్చి గ్యాంగ్ ను అడ్డుకునేందుకు యత్నించగా వారిపై కూడా దాడి చేసి యువతిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఆదిభట్లలో జరిగిన ఈ కిడ్నాప్ ఘటన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యువతి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు, ఇంటి ముందు నిలిపి ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేశారు. తాను ప్రేమించిన అమ్మాయికి వేరొకరితో వివాహం జరిపించాలని చూడటంతో ఈ కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మిస్టర్ టి టైమ్ ఓనర్ నవీన్ రెడ్డి అనే యువకుడు తన కూతుర్ని కిడ్నాప్ చేశాడని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు యువతిని ఎక్కడికి తీసుకెళ్లాడని గాలింపు చర్యలు చేపట్టారు.
యువతి బంధువు ఏమన్నారంటే..
షటిల్ ఆడేందుకు అమ్మాయి వెళ్లేది, నవీన్ రెడ్డి కూడా అక్కడికి షటిల్ ఆడేందుకు వచ్చేవాడు. అక్కడ వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందామా అని నవీన్ రెడ్డి ఆమెను అడిగాడు. అయితే తన తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుందన్నారు. కొన్ని రోజుల తరువాత మరో వ్యక్తిని పెళ్లి ప్రస్తావన కోసం మా ఇంటికి పంపించాడు. అతడికిచ్చి పెళ్లి చేయడానికి తమకు ఇష్టం లేదని అమ్మాయి తల్లిదండ్రులు తేల్చి చెప్పేశారు. తనతో పెళ్లి ఎందుకు చేయించరు అంటూ కోపం పెంచుకున్న నవీన్ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేశాడు. అమ్మాయిని రెగ్యూలర్ గా ఫాలో అవుతూ ఫొటోలు తీయడం లాంటివి చేసి వేధింపులకు గురిచేశాడు. ఇది భరించలేని అమ్మాయి ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఓరోజు ఉదయం 10 గంటలకు ఫిర్యాదు చేసింది. కానీ సాయంత్రం 6 గంటలవరకు అమ్మాయిని పీఎస్ లోనే కూర్చోబెట్టారు. ఎస్ఐ క్రిష్ణయ్య నిందితుడు నవీన్ రెడ్డిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారని తెలిపారు. అమ్మాయి పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి ఫొటోలు, వీడియోలు ఎందుకు పోస్ట్ చేస్తున్నావు, వేధింపులు మానుకోవాలని పోలీసులు వార్నింగ్ ఇవ్వగా, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి తీసేశానని నవీన్ రెడ్డి చెప్పడంతో కేసు నమోదు చేశారని బాధితురాలి బంధువులు మీడియాకు వెల్లడించారు.
రావడంతోనే సీసీ కెమెరా పగలగొట్టారు..
ఇంటికి ఒకేసారి చాలా మంది గుంపు వచ్చిందని, రావడంతో దాడికి పాల్పడ్డారని యువతి తండ్రి తెలిపారు. తాను అమ్మాయిని ఇష్టపడుతున్నానని, తనకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేయడం లేదని ప్రశ్నిస్తూ కొందరు యువకులతో కలిసి తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపై ఇంట్లోకి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేసి తన కూతుర్ని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చెప్పారు. యువకులు రావడంతోనే మొదట సీసీ కెమెరా ధ్వసం చేశారని యువతి బంధువు తెలిపారు. అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తనకు కాకుండా వేరే వాళ్లకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తున్నారని అడుగుతూ నవీన్ రెడ్డి వెంట వచ్చిన యువకులు దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఎలాగైనా తమకు న్యాయం చేయాలని, అమ్మాయి జాడ కనిపెట్టి, సాధ్యమైనంత త్వరగా తమకు అప్పగించాలని పోలీసులను ఆమె తల్లిదండ్రులు, బంధువులు కోరారు. ఇంటిపై దాడికి పాల్పడుతున్న సమయంలో పోలీసులకు, 100కు కాల్ చేసిన స్పందించలేదని అమ్మాయి బంధువుల ఆరోపించారు.
నవీన్ టీ షాపును తగలబెట్టిన యువతి బంధువులు
అమ్మాయిని కిడ్నాప్ చేయడంతో ఆమె బంధువులు నిందితుడు నవీన్ కు చెందిన మిస్టర్ టీ షాప్ ను తగలబెట్టారు. హస్తినాపురంలోని మిస్టర్ టీ స్టాల్ షాపును మూసివేయడంతో పాటు, అందులో పనిచేసే సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.