Telangana BJP : ప్రస్తుతం బీజేపీలో ఉన్నా - కేసీఆర్‌ను ఓడించే లక్ష్యం కోసం నిర్ణయాలు - రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తామని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. పార్టీ మార్పు వార్తలను ఖండించారు.
Telangana BJP : కేసీఆర్ ను ఓడించాలన్న లక్ష్యంతోనే బీజేపీలో చేరానని.. ఆ లక్ష్యం సాదించడానికి ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. హైకమాండ్ పిలుపుమేరకు ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హైకమాండ్ పిలుపు మేరకే ఢిల్లీ వెళ్తున్నామన్నారు. కేసీఆర్ ను గద్దె దించే లక్ష్యంతో . తాను బీజేపీ పార్టీలో చేరాన్నారు. ఆ లక్,్యం సాధించడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తాను పార్టీ మారుతున్నట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు . తాను ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నానని.. బీజేపీ విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు.
కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయడానికి కాకుండా.. బీజేపీ సాఫ్ట్ గా వ్యవహరిస్తూ ఉంటే. తమ నిర్ణయాన్ని మీడియాకే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్ కూడా ఢిల్లీకి వెళ్లారు. అలాగే .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా హైకమాండ్ అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించింది. దీంతో తెలంగాణ బీజేపీకి సంబంధించిన కీలక నిర్ణయాలను హైకమాండ్ తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించే పార్టీ బీజేపీ మాత్రమేనని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీలో చేరారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మునుగోడులో ఉపఎ్నిక వచ్చింది. ఉపఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీ కార్యక్రమాల్లో సైలెంట్ గా ఉన్నారు. ఆయనకు పార్టీ పరంగా కూడా పెద్దగా పదవులేం ఇవ్వలేదు. తర్వాత కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ హైకమాండ్ సన్నిహితంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం పెరుగుతోంది. ఈ కారణంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా ఉంటున్నారు.
ఆయన సోదరుడు ఎంపీ వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వస్తారని గతంలో ప్రచారం జరిగింది. కానీ మారిన రాజకీయ పరిణామాలతో ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతానని పదే పదే ప్రకటి్స్తున్నారు. అంతేనా.. తన సోదరుడు కూడా మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తారని అగ్రనేతలకు హామీలు ఇస్తున్నారు.. దీంతో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్తారని విస్తృతంగా ప్రచారం ప్రారంభమయింది. ఈ క్రమంలో ఆయనను హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial