(Source: ECI/ABP News/ABP Majha)
Rahul Gandhi: సంగారెడ్డిలో జోడో యాత్ర సందడి - కొరడాతో కొట్టుకున్న రాహుల్, గిరిజనులతో థింసా నృత్యం - వీడియోలు
ఉత్తర తెలంగాణ గిరిజన సంస్కృతిలో భాగమైన సాంప్రదాయక థింసా నృత్యంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. గిరిజనులతో పాటు రాహుల్ గాంధీ కూడా థింసా నృత్యం చేశారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అత్యంత ఉల్లాసపూరితంగా సాగుతోంది. నేడు (నవంబర్ 3) సంగారెడ్డి జిల్లా గణేష్ గడ్డ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం అయింది. సంగారెడ్డి నియోజకవర్గంలోకి రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి సహా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. నేడు ఏకంగా 25 కిలో మీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. చేర్యాల, కంది, పోతిరెడ్డి పల్లి చౌరస్తా, సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ఫసల్వాదీ మీదుగా శివంపేట వరకు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది.
కొరడాతో సరదాగా కొట్టుకున్న రాహుల్
ఉత్తర తెలంగాణ గిరిజన సంస్కృతిలో భాగమైన సాంప్రదాయక థింసా నృత్యంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. గిరిజనులతో పాటు రాహుల్ గాంధీ కూడా థింసా నృత్యం చేశారు. అంతేకాక, పోతురాజులను కూడా రాహుల్ కలిశారు. వారి వద్ద ఉన్న కొరడా తీసుకొని సరదాగా తనను తాను రాహుల్ గాంధీ కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అటు చేర్యాల దగ్గర చిన్నారులతో కలిసి రాహుల్ గాంధీ కరాటేలో పాల్గొన్నారు. చిన్నారులు బాక్సింగ్ పంచ్ లు చేస్తుండగా వారికి చెయ్యి అడ్డు పెట్టి మరింతగా ప్రోత్సహించారు.
రాహుల్ గాంధీ జోష్‌తో కొరడాతో కొట్టుకున్న సరదా వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
యాత్రలో పాల్గొన్న నేవీ అధికారి
రాహుల్ పాదయాత్రలో విశ్రాంత నేవీ ఉన్నతాధికారి చీఫ్ అడ్మిరల్ రామదాసు పాల్గొన్నారు. ఆయనకు 89 సంవత్సరాలు. ఆ వయసులో కూడా అడ్మిరల్ రామదాసు రాహుల్ గాంధీతో కలిసి యాత్రలో కొంత దూరం నడిచారు. ఆయన తన సతీ సమేతంగా యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పాద యాత్రకు సంపూర్ణ మద్దతు పలికి ముందుకు కదిలారు. నేటి భారత్ జోడో యాత్రలో ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శైలజానాథ్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి. సీతక్క, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
గురువారం నాడు (నవంబరు 3) రాహుల్ గాంధీ తన పాదయాత్రను పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించారు. రోజూ ఉదయం 5.55 నిమిషాలకు మొదలయ్యే యాత్ర నేడు పొగ మంచు కారణంగా కాస్త ఆలస్యం అయింది.