Rahul Gandhi: తెలంగాణకు మరోసారి రాహుల్ గాంధీ - రెండో వారంలో మూడు రోజులు ఇక్కడే మకాం!
అక్టోబరు నెల రెండో వారంలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. మొత్తం మూడు రోజులపాటు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో వచ్చే రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున జాతీయ పార్టీల అగ్ర నేతల పర్యటనలు కొనసాగుతున్నాయి. ప్రతి వారం అగ్ర నేతల సభలు, కార్యక్రమాలు ఉండేలా రాష్ట్ర విభాగాలు ప్రణాళిక చేసుకుంటున్నాయి. ఈ మధ్యే ప్రధాని మోదీ, అమిత్ షా, సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ ఇలా ఆగ్ర నేతల రాకతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా మరోసారి కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు రారున్నారు.
అక్టోబరు నెల రెండో వారంలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. మొత్తం మూడు రోజులపాటు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ పర్యటనకు తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నేతలు కార్యక్రమాలు రెడీ చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
కొద్ది వారాల క్రితమే హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం, కాంగ్రెస్ విజయభేరి పేర్లతో భారీ సభలు కూడా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన ఈ సభలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించింది. అధికారంలోకి వచ్చేది తామేనని.. ఆ వెంటనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తుక్కుగూడ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో బాగా ఉత్సాహం నింపింది.
నిన్ననే ఓటర్ల జాబితా విడుదల
మరో రెండు నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితాను బుధవారం (అక్టోబరు 4) రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుష ఓటర్లు కోటి 58 లక్షల 71 వేల 493 మంది ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక మహిళా ఓటర్లు కోటి 58 లక్షల 43 వేల 339 మంది ఉన్నట్లు ప్రకటించింది. ఇక ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2,557 మంది ఉన్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఓటర్ల సంఖ్య 5.8 శాతం పెరిగినట్లు పేర్కొంది.
రాష్ట్రంలో కొత్త ఓటర్ల సంఖ్య 17.01 లక్షలుగా ఉండగా.. 6.10 లక్షల ఓట్లను తొలగించినట్లు ఈసీ స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలో ఓటర్ల జాబితా లింగ నిష్పత్తి 998: 1000గా ఉందని తెలిపింది. ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్లను తొలగించిన తర్వాత 10 లక్షల మంది ఓటర్లు పెరిగారు. బోగస్ ఓట్లు తొలగింపు, రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి సర్వే చేపట్టిన తర్వాత తుది ఓటర్ల జాబితాను ఈసీ సిద్దం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పరిశీలించిన తర్వాత ఇవాళ తుది ఓటర్ల జాబితాను విడుదల చేశారు. మంగళవారం రాష్ట్ర పర్యటనకు సీఈసీ బృందం వచ్చింది. హైదరాబాద్‌లోని తాజ్ హోటల్‌లో దిగిన సీఈసీ అధికారులు.. 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండనున్నారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల, భద్రతా చర్యలు, డబ్బు పంపిణీ కట్టడిపై రాష్ట్ర అధికారులతో సమావేశం నిర్వహించారు. అలాగే రాజకీయ పక్షాలతో కూడా సీఈసీ అధికారుల సమావేశమయ్యారు.