Rahul Hyderabad : హైదరాబాద్ ఎయిర్‌పోర్టు త్వరలో మోదీ సన్నిహితుల చేతుల్లోకి - టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే : రాహుల్
టీఆర్ఎస్ , బీజేపీ ఒక్కటేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే డ్రామాలాడుతాయన్నారు.
Rahul Hyderabad : కేవలం ఇద్దరు, ముగ్గురు పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డులో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో రాహుల్ ప్రసంగించారు. రోడ్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు కొంతమంది చేతిలో బందీగా ఉన్నాయన్నారు. పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ ధరలపై ఇప్పుడు మోడీ ప్రస్తావించరని విమర్శించారు. చిన్నపాటి వ్యాపారస్తులు, రైతులకు రుణాలు దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కానీ కొంతమంది పెద్దలు లోన్లు తీసుకుని ఎగ్గొట్టినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే : రాహుల్
దేశాన్ని విడగొట్టాలని.. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాము పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఉన్నత చదువులు చదివిన వారికి ఉద్యోగాలు దొరకడం లేదన్నారు. విభిన్న మతాలకు చెందిన వాళ్లు సోదర భావంతో మెలగటం హైదరాబాద్ నగర ప్రత్యేకత అని రాహుల్ అభివర్ణించారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని విమర్శించారు. ప్రధాని మోడీ లైన్ లోనే సీఎం కేసీఆర్ నడుస్తున్నారని తెలిపారు. పార్లమెంట్ లో బీజేపీ తీసుకొచ్చే ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు. కాంగ్రెస్ ఏదైనా అంశాన్ని లేవనెత్తితే మాత్రం.. టీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తారని విమర్శించారు.
హైదరాబాద్ ఎయిర్‌పోర్టు త్వరలో మోదీ స్నేహితుల చేతుల్లోకి : రాహుల్
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అందరూ చూస్తుండగానే మోదీ స్నేహితులైన వ్యాపారవేత్తలు అతి త్వరలోనే స్వాధీనం చేసుకుంటారని రాహుల్ ఆరోపించారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులను, ఎల్‌ఐసీని కేంద్రం అమ్మేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థల యజమానులు లక్షలు, కోట్ల రూపాయలు రుణం తీసుకోగలుగుతారని, చిరు వ్యాపారులు మాత్రం చిన్న రుణాలు కూడా పొందలేకపోతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఎన్నికల ముందు ఇద్దరూ కలిసి డ్రామా చేస్తారని చెప్పారు. ఎప్పుడేమి చేయాలో కేసీఆర్‌కు మోదీ సూచిస్తారని రాహుల్ చెప్పారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ కూడా నిరుద్యోగం గురించి ఊసెత్తరని ఎద్దేవా చేశారు.
కేంద్రంలో అధికారంలోకి వస్తాం : ఖర్గే
2024లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్, కాంగ్రెస్ నేతృత్వంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి సారి హైదరాబాద్ వచ్చారు. పాదయాత్రలో పాల్గన్నారు. అభివృద్ధి చేయాలని అధికారం ఇస్తే టీఆర్ఎస్ అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. పలు రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారని.. మొదట తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పలు బిల్లులను కాంగ్రెస్ వ్యతిరేకిస్తే... టీఆర్ఎస్ మద్దతిచ్చిందని గుర్తు చేశారు. 13 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా.. మోడీ ప్రభుత్వం భర్తీ చేయడం లేదన్నారు. కేవలం 75 వేల ఉద్యోగాలు ఇచ్చి.. గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.