Sankranti Buses : ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి దందా - ఒక్కో టిక్కెట్ ధర రూ.3వేలకుపైమాటే
Ticket Rates in Private Travels : సంక్రాంతి పండక్కి వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ భారీ మొత్తంలో టిక్కెట్ ధరను వసూలు చేస్తున్నాయి.
Private Travels : సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే మీ జేబు నిండుగా ఉండేలా చూసుకోండి. లేదంటే అంతే.. అవును మరి ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉంది. పల్లెబాట పడుతోన్న జనాలను ప్రైవేట్ ట్రావెల్స్ దండుకుంటున్నాయి. సంక్రాంతి పండక్కి సాధారణంగానే ఫుల్ రష్ ఉంటుంది. ఇదే అదనుగా చేసుకున్న ప్రైవేటు ఆపరేటర్లు టిక్కెట్ ధరలను అమాంతం పెంచేశాయి. ఇది చూసిన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇలా ఇష్టారీతిన టిక్కెట్ ఛార్జీలు పెంచుతున్నా రవాణా శాఖ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ఒక్కో టిక్కెట్ ధర రూ.3వేలకు పైనే
ఆర్టీసీ బస్సుల కంటే దాదాపు మూడింతలు ఎక్కువగా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు టిక్కెట్ ధరలను వసూలు చేస్తున్నాయి. గతంలో రూ.1000, 12వందలు ఉన్న టిక్కెట్ ధర ఇప్పుడు రూ.3వేలకు పైమాటే. రాజమండ్రికి వెళ్లే ప్రయాణికులకు రూ.3,500 - 4వేలు, భీమవరం వెళ్లే వారికి రూ.3 -4వేలు వసూలు చేస్తున్నారు. ఇక కుటుంబం మొత్తం వెళ్లాలంటే కేవలం టిక్కెట్ ల కోసమే దాదాపు రూ.20వేల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లేందుకు నానా కష్టాలు పడుతున్నారు. టిక్కెట్ ధరను పదులు, వందలు కాకుండా ఒక్కసారిగా వేలల్లో పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలకు హెచ్చరిక
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రద్దీ పెరిగినట్టు అయితే ఇంకా బస్సుల సంఖ్య పెంచుతామని, మరిన్ని బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ సమయంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అధిక ఛార్జీలు వసూలు చేస్తే ప్రయాణికులు.. అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తమ ప్రభుత్వం ప్రయాణికుల భద్రత, సంక్షేమనికే ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పారు.
సంక్రాంతికి స్పెషల్ బస్సులు
మరో పక్క రెండు తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. తెలంగాణలో 6432 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు టీజీఆర్టీసీ ఇప్పటికే ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్ లో 7,200 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అందుకు సంబంధించిన అనేక ఏర్పాట్లను కూడా ఈ రాష్ట్రాలు పూర్తి చేశాయి.
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
మరోపక్క సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తోన్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో అదనపు కోచ్ లను జోడించింది. ఇప్పటివరకు 16 కోచ్ లు రాకపోకలు సాగిస్తుండగా.. ఇప్పుడు అదనంగా మరో 4 కోచ్ లను అందుబాటులోకి తెచ్చినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీని వల్ల 1,128గా ఉన్న సీటింగ్ కెపాసిటీ 1,414కు పెరగడంతో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండనుంది.