PRAVEEN IN BSP : "స్వేరో" పునాదులతో ప్రవీణ్ పాలిటిక్స్..! వ్యూహాత్మకంగా బీఎస్పీలో చేరిక..! దళితులంతా ఆయన వెంటనా..?
మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన దళిత వర్గాలకు నాయకుడయ్యేందుకు స్వేరోల సాయంతో రాజకీయం చేసే అవకాశం ఉంది.
ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తన సర్వీసును ముందుగానే వదులుకుని రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు. ఆయన బహుజన సమాజ్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన చర్చలన్నీ పూర్తి చేసుకున్నారు. ముహుర్తం కూడా ఖరారు చేశారు. తన రాజీనామా లేఖలో కాన్షిరామ్ గురించి ప్రస్తావించారు ప్రవీణ్. అయితే బీఎస్పీలో చేరుతారని ఎవరూ అనుకోలేదు. కానీ ఆయన మాత్రం.. బీఎస్పీని ఎంచుకున్నారు. ఆగస్టు 8న నల్లగొండ జిల్లాలోని ఎన్‌జీ కాలేజ్ మైదానంలో ఐదు లక్షలమందితో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి, ప్రవీణ్ బీఎస్పీలో చేరతారని స్వేరోలు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
తెలంగాణ దళితలకు ఏకైక నేతగా అవతరించేందుకు ప్రవీణ్ కుమార్ ప్రయత్నాలు..!
రాజకీయాల్లో ప్రవీణ్ కుమార్ రాణిస్తారో లేదో తెలియదు కానీ.. ఆయన మాత్రం దళిత వర్గానికి బలమైన నాయకుడిగా ఎదగాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. కాన్షిరామ్‌లాగా.. మాయవతిలా.. అడుగులు వేయాలని అనుకుంటున్నారు. అందుకే.. తన ప్రతి మాటలోనూ దళిత వాదమే వినిపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి.. టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంలో స్టేజిపై ఉన్న ఇతర కులాల నేతల్ని గారు అని ప్రస్తావించి.. దళిత నేతల్ని మాత్రం పేరు పెట్టి పిలిచారు. ఈ విషయాన్ని కూడా ప్రవీణ్ ప్రశ్నిస్తున్నారు. కుల అహంకారమే అంటున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ రాజ్యాధికారం రాదని.. పోరాటం చేయాలని.. కలిసి రావాలని పిలుపునిస్తుననారు. ఓ పదవి కోసమే అయితే ఆయనకు కాంగ్రెస్,టీఆర్ఎస్, బీజేపీ రెడ్ కార్పెట్ వేసి పిలిచేవి. కానీ ఆయన అంతకు మించి ఆలోచిస్తున్నారు.
ప్రవీణ్ బలం.. బలంగా స్వేరోస్..!
ప్రవీణ్ కుమార్ సాదాసీదా ఐపీఎస్ కాదు. ఆయన ఐపీఎస్ అయినా.. పోస్టింగ్ మాత్రం సాంఘిక సంక్షేమ శాఖలో తీసుకున్నారు. తెలంగాణలోని గురుకుల పాఠశాలవ్యవహారాలను తొమ్మిదేళ్లుగా తన కనుసన్నల్లో ఉండేలా చూసుకున్నారు. " స్వేరోస్" అనే సంస్థను పాతుకుపోయేలా చేయగలిగారు. సోషల్ వెల్ఫేర్ ఏరోస్ ను స్వేరోస్‌గా పిలుస్తారు. ఈ సంస్థను ప్రవీణ్ కుమార్ ప్రారంభించలేదు. కానీ ఈ సంస్థకు వెన్నుముకగా ఆయన నిలిచారు. ప్రవీణ్ కుమార్ హయాంలో గురుకల హాస్టళ్లలో స్వేరోస్ విస్తృతంగా విస్తరించారు. మెల్లగా స్వేరో భావాజాలను దళిత కాలనీలకు విస్తరించారు. స్వేరోస్ భావజాలం.. చాప కింద నీరులా విస్తరించింది. ఇప్పుడు వీరినే ప్రవీణ్ కుమార్ తన బలంగా భావిస్తున్నారు. దళిత భావజాలాన్ని అందుకే విస్తృతంగా వినిపిస్తున్నారు.
దళితులంతా అండగా నిలబడితే ప్రవీణ్ తెలంగాణ కాన్షీరామే..!
తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 63,60,158 మంది దళితులున్నారు. అంటే రాష్ట్ర జనాభాలో 17.5 శాతం. వీరు రాజకీయ పార్టీల భవితవ్యాన్ని మార్చేయగలరు. ఆ విషయం రాజకీయ పార్టీలకు తెలుసు కాబట్టే.. దళిత వాదం అందుకుంటున్నారు. అయితే.. దళితుల్లో సహజంగానే తమను పైకి రానివ్వడం లేదన్న అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి నుంచి ఇప్పటి వరకూ ఒక్క సరైన నాయకుడు పుట్టుకురాలేదు. ఇప్పుడు తాను ఆ బాధ్యత తీసుకుంటానని.. వారికి నాయకుడిగా ఎదగాలని ప్రవీణ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఆయన చాలా కాలం నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. దానికి స్వేరోస్‌నే సాక్ష్యం. ఆయన ముందు ముందు ఎంత ప్రతిభావంతంగా అడుగులు వేస్తారన్నదానిపైనే ఆయన సక్సెస్ ఆధారపడి ఉంటుంది.