Yadadri Yagam : సాదాసీదాగానే యాదాద్రి ఆలయం పున:ప్రారంభోత్సవం - నారసింహ మహాయాగం వాయిదా ! చినజీయర్ చేతుల మీదుగా నిర్వహించడం ఇష్టం లేకనేనా ?
సాదాసీదాగానే యాదాద్రి ఆలయం పున:ప్రారంభోత్సవం జరగనుంది. భారీగా నిర్వహించాలనుకున్న నారసింహ మహాయాగం వాయిదా పడింది. చినజీయర్ చేతుల మీదుగా నిర్వహించడం ఇష్టలేకనే వాయిదా వేశారా ?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) అత్యంత ప్రతిష్టాత్మకం తీసుకున్న యాదాద్రి ( Yadadri ) ఆయన పున:ప్రారంభోత్సవం యాగం లేకుండానే జరగనుంది. యాదాద్రి ఆలయ పునంప్రారంభం సందర్భంగా నిర్వహించాలని నిర్ణయించిన నారసింహా మహా సుదర్శనయాగం ను వాయిదా వేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆలయాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికాకపోవడంతో నారసింహ మహాయాగాన్ని వాయిదా వేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. మూలవర్యుల దర్శనం మాత్రం గతంలో నిర్ణయించినట్లుగానే మార్చి 28న ప్రారంభమవుతుందని ప్రకటించారు. మహాకుంభ సంప్రోక్షణ చేపట్టిన తర్వాత ప్రధాన ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు.
వారం రోజుల కిందట యాదాద్రి ఆలయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన సీఎం కేసీఆర్ యాగ ఏర్పాట్లనూ సమీక్షించారు. మార్చి 28 వ తేదీన మహా కుంభ సంప్రోక్షణకు 8 రోజుల ముందునుంచి అంటే మార్చి 21వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు, పీఠాధిపతులు యోగులు, స్వామీజీలను ఆహ్వానించారు. మహా సుదర్శన యాగంలో 10వేల మంది రుత్విజులు పాల్గొనేలా ప్లాన్ చేశారు. పనులు కూడా ప్రారంభం అయ్యాయి. యాగం కోసం రెండు లక్షల కిలోల ఆవునెయ్యిని సమకూర్చుకోవాలని కేసీఆర్ సూచించారు. అయితే ఇప్పుడు వాటన్నింటినీ ఆపేశారు. వారం రోజుల కిందటి వరకూ యాగం నిర్వహించాలనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది.
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ( CM KCR ) దైవభక్తి మెండు. ఆయన అనుకుంటే చేసి తీరుతారు. గతంలో ఆయన నిర్వహించిన యాగాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. అలాగే యాదాద్రిలో మహా సుదర్శన యాగాన్ని నిర్వహిస్తారని అనుకున్నారు. కానీ హఠాత్తుగా యాగం వాయిదాకు నిర్ణయం తీసుకోవడానికి కారణం చినజీయర్ ( China jeyar Swamy ) స్వామిపై అసంతృప్తే కారణమన్న అభిప్రాయం వినిపిస్తోంది. యాదాద్రి ఆలయ పునంప్రారంభోత్సవం, యాగం కూడా చినజీయర్ చేతుల మీదుగానే సాగాల్సి ఉంది.
ముచ్చింతల్‌లో జరిగిన సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్‌కు అవమానం జరిగిందని .. ఈ కారణంగానే ఆయన చినజీయర్‌పై అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ఆయన ఉత్సవాల్లో పాల్గొనలేదని చెబుతున్నారు. ఇప్పుడు యాదాద్రి ఆలయ ఉత్సవాలను కూడా చినజీయర్ చేతుల మీదుగా నిర్వహించడం ఇష్టం లేకనే కేసీఆర్ వాయిదాకు మొగ్గు చూపినట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ అసంతృప్తి గురించి తెలిసేశుక్రవారం చినజీయర్ ప్రెస్ మీట్ ద్వారా వివరణ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఆయనపై కేసీఆర్ అసంతృప్తి తగ్గిందో లేదో స్పష్టత లేదు.