Congress Protest: కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు!
Congress Protest: కాళేశ్వరం ప్రాజెక్టు చూసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
Congress Protest: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన సీఎల్పీ బృందాన్ని పట్టణంలోని మణుగూరు క్రాస్ రోడ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, పోదెం వీరయ్యలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్లారు.
Condemn the arrest of Telangana CLP @BhattiCLP &MLA @OffDSB @jeevanreddyMLC @seethakkaMLA Pondem Veeraaih garu
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) August 16, 2022
who protested for over 5 hours seeking permission to visit Dummugudem flood affected areas. pic.twitter.com/fi9IE3yvk7
కాంగ్రెస్ నేతల అడ్డగింత
ముందుగానే విషయం తెలుసుకున్న పోలీసులు... వందల సంఖ్యలో అక్కడికి వచ్చారు. ప్రాజెక్టుల సందర్శనకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ.. కాంగ్రెస్ శ్రేణులు వినకుండా ముందుకు పోయేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు అంతా అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ నాయకుల ధర్నా
కాళేశ్వరం సందర్శనకు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా సందర్శనకు వెళ్తే పోలీసులు అడ్డుకోవడం, నిరంకుశ చర్య అని విమర్శించారు. నిజాం నాటి పాలనను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల దౌర్జన్యం నశించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నినదించారు. సీఎం డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసులపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ధర్నా కారణంగా దాదాపు 3 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు గోల చేశారు. ఎలాగైనా సరే ట్రాపిక్ తొలగించాలని కోరడంతో.. పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి పాల్వంచ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అరెస్టయిన వారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, పోదెం వీరయ్యలు ఉన్నారు.
భద్రతా కారణాల వల్లే అనుమతి నిరాకరణ
భద్రతా కారణాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు కాంగ్రెస్ నాయకులకు వెల్లడించారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రాజెక్టులకు ఎందుకు వెళ్లనివ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న రహస్యం ఏమిటని నిలదీశారు. ప్రాజెక్టులో ఉన్న లోపాలు బయట పడతాయనే భయంతోనే... సీఎం కేసీఆర్ పోలీసులతో చెప్పి తమను అక్కడికి వెళ్లనీయకుండా చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంలా మారిందని, దాని నుండి ధనార్జనే లక్ష్యం చేసుకున్నారని నాయకులు విమర్శించారు.