IT Employees: ఐటీ ఉద్యోగుల ఆందోళనలపై పోలీసుల ఆంక్షలు
IT Employees: హైదరాబాద్ నగరంలో ఐటీ ఉద్యోగుల ఆందోళనలపై పోలీసుల ఆంక్షలు విధించారు. గత 3 రోజులుగా మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్ రాం గూడ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.
IT Employees: హైదరాబాద్ నగరంలో ఐటీ ఉద్యోగుల ఆందోళనలపై పోలీసుల ఆంక్షలు విధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ గత 3 రోజులుగా హైదరాబాద్‌లోని ఐటీ ప్రాంతాలైన మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్ రాం గూడ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సైతం పలు ప్రాంతాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఐటీ ఉద్యోగుల ఆందోళనలకు ఎలాంటి అనుమతి లేదని తేల్చిచెప్పారు. మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడలో పోలీసులు ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా ధర్నాలు నిర్వహిచి సామాన్య ప్రజలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో టెకీలు రెండు రోజుల ఆందోళన చేపట్టారు. చంద్రబాబు వల్లనే ఐటీ అభివృద్ధి చెందిందని, ఇప్పుడు కూడా బయటకు రాకపోతే తాము వేస్ట్ అన్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద టెకీలు, యువత నల్ల రిబ్బన్లతో నిరసనకు దిగారు. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు హయాంలో ఐటీని ఆయన అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని చెప్పారు. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
హైదరాబాద్ అభివృద్ధిలో బాబు పాత్ర కీలకం
చంద్రబాబు అరెస్ట్ అక్రమం, అన్యాయం అన్నారు. చంద్రబాబు కోసం కాదు ఏపీ అభివృద్ధి కోసం ప్రజలందరూ బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో బాబు పాత్ర కీలకమని గుర్తుచేశారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. కానీ కావాలనే కుట్ర చేసి బాబును జైలుకు పంపారని ఆరోపించారు. తాను అవినీతి పరుడు అయితే మిగతా వాళ్లు కూడా అలాగే ఉంటారని జగన్ భ్రమిస్తున్నారని చెప్పారు.
భారీగా తరలివచ్చిన టీడీపీ సానుభూతిపరులు
స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి అని ఆరోపించి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ సానుభూతిపరులు మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విప్రో సర్కిల్ వద్దకి వచ్చి టెకీలతో కలిసి నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలో పాల్గొన్నారు. విజన్, డెవలప్ మెంట్ అంటే గుర్తుకొచ్చే వ్యక్తి చంద్రబాబు అని అలాంటి నేతను అక్రమంగా అరెస్ట్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెకీలు, టీడీపీ మద్దతుదారుల నిరసనతో విప్రో సర్కిల్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది.
కూకట్ పల్లిలో ర్యాలీ
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆందోళనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం కేపీహెచ్‌బీకాలనీలోని గాంధీ విగ్రహం వద్ద భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. 500 మందికిపైగా చంద్రబాబు అభిమానులు రహదారిపైకి వచ్చిన నిరసన వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు జాతీయరహదారిపై నినాదాలు చేశారు. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అని ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఏపీ పరిరక్షణ సమితి సభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ హెచ్చరించారు.
Also Read: ఐటీ కారిడార్‌లో పొలిటికల్ కేక- చంద్రబాబు అరెస్ట్ పై భగ్గుమన్న ఐటీ ఉద్యోగులు