స్వప్నలోక్ మృతుల కుటుంబాలకు రూ. 5లక్షలు ఎక్స్ గ్రేషియా - అండగా ఉంటామని ప్రభుత్వం హామీ
స్వప్నలోక్ ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటామని ప్రకటించారు. ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని చెప్పింది.
Swapnalok Fire accident : ఆరుగురు నిరుపేద యువతీ యువకుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటన! ఈ ఫైర్ యాక్సిడెంటుపై కేసు నమోదు చేశారు మహంకాళి పోలీసులు. 49/2023 U/S 304 పార్ట్-II, 324, 420 IPC, సెక్షన్ 9 (B) పేలుడు పదార్థాల చట్టం, 1884 కింద కేసు ఫైల్ చేశారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ సూపర్‌వైజర్ ఇచ్చిన ఫిర్యాదుతో FIR నమోదు చేశారు. గురువారం రాత్రి 7:15కు కాంప్లెక్సులో మంటలు చేలరేగాయి. KEDIA INFOTECH Ltd., VIKAS PAPER FLEXO Packaging Ltd., నుంచి మంటలు, పొగలు వస్తున్నట్లు తొలుత గుర్తించారు. ఈ రెండు ఆఫీసులు స్వప్నలోక్ కాంప్లెక్స్ 5వ అంతస్తు, B బ్లాక్‌లో ఉన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలను ఆర్పి కొంతమందిని రక్షించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. చనిపోయిన ఆరుగురు పొగవల్లే ప్రాణాలు వదిలారని డాక్టర్లు తెలిపారు. భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమైన స్వప్నలోక్ సూర్యకిరణ్ ఎస్టాబ్లిష్మెంట్ అసోసియేషన్, కేడియా ఇన్ఫోటెక్ లిమిటెడ్, వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకేజింగ్ లిమిటెడ్, క్యూనెట్, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా- సీఎం కేసీఆర్
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడటం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో వుండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రులు మహమూద్ అలీ, తలసానిని సీఎం కేసీఆర్ సూచించారు.
స్వప్న లోక్ సంఘటన బాధాకరం- తలసాని, మహమూద్ అలీ
మృతిచెందిన వారంతా 20-23 మధ్యవయస్కులు కావడం బాధాకరమన్నారు మంత్రి తలసాని. ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని అభిప్రాయపడ్డారు. పొగతో ఊపిరిఆడకనే ఆరుగురు చనిపోయారని తెలిపారు. స్వప్న లోక్ బిల్డింగ్ ఓనర్స్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోడౌన్స్, కమర్షియల్ కాంప్లెక్సులు ఫైర్ సేఫ్టీ మెజర్ మెంట్స్ సరిగా తీసుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే భవిష్యత్తులో నిర్మాణ అనుమతులు రావని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని చెప్పారు మంత్రి తలసాని. కారణమైన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్పెషల్ డ్రైవ్ చేసి ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తామన్నారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాత్రి నుంచి ఆయన అక్కడే ఉండి సహాయక చర్యలు ఎప్పటికప్పుడు పరిశీలించారు.
ఒక్కో కుటంబానికి ఎమ్మెల్యే పెద్ది రూ. 50వేలు సాయం
స్వప్నలోక్ అగ్ని ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు అండగా ఉంటామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మృతుల్లో ముగ్గురు ఆయన నియోజకవర్గానికి చెందినవారే కావడంతో, ఎమ్మెల్యే పెద్ది వారికి బాసటగా నిలిచారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామానికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి, ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఒక్కో కుటుంబానికి వ్యక్తిగతంగా రూ. 50 వేల ఆర్థికసాయం ప్రకటించారు పెద్ది సుదర్శన్ రెడ్డి.