PM Modi in Mahabubnagar: తెలంగాణలో వారి చేతుల్లో కారు స్టీరింగ్! ఈరోజు రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు నిద్రపట్టదు: ప్రధాని మోదీ
PM Modi Speech At Public Meeting in Mahabubnagar: తెలంగాణలో కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో రాష్ట్ర ప్రజలకు తెలుసు.. కేవలం ఆ రెండు కుటుంబాల పాలనతోనే అభివృద్ధి జరగడం లేదని ప్రధాని మోదీ ఆరోపించారు.
PM Modi Speech At Public Meeting in Mahabubnagar:
మహబూబ్ నగర్: తెలంగాణలో కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో రాష్ట్ర ప్రజలకు తెలుసు.. కేవలం ఆ రెండు కుటుంబాల పాలన (బీఆర్ఎస్, ఎంఐఎం) కారణంగానే అభివృద్ధి జరగడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కేవలం కమీషన్ల కోసమే ఈ కుటుంబాల పాలన జరుగుతోందని, మార్పు రావాలంటే బీజేపీని గెలిపించాలని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు కుటుంబ వ్యవస్థగా, ప్రైవేట్ సంస్థగా మార్చేశారు.. ఇందులో సీఈఓ, డైరెక్టర్లు మొత్తం కుటుంబసభ్యులు ఉంటే.. చిన్న ఉద్యోగాల కోసం బయటివాళ్లను తీసుకుంటున్నారని ఆరోపించారు. మోదీ హామీ ఇచ్చారంటే నెరవేరుస్తారని, ఆ నమ్మకంతోనే పాలమూరులో బీజేపీ ప్రజాగర్జన సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని చెప్పారు. ఈ సభతో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మోదీ నాంది పలికారు.
తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.13,500 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభం చేశానన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీకి మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే, అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. మాట నిలబెట్టుకునే బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాణి రుద్రమదేవి లాంటి వీర వనితలు పుట్టిన గడ్డ తెలంగాణ అని పేర్కొన్న ప్రధాని.. నారీ శక్తి కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి వారి అవకాశాలు పెంచుతామన్నారు. మీ జీవితాలలో వెలుగులు నింపేందుకు ఢిల్లీలో ఒకరు ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు.
దేశం అభివృద్ధి చెందాలంటే జాతీయ రహదారులు ఎక్కువగా ఉండాలని, 2014కు ముందు కేవలం 2,500 కి.మీ జాతీయ రహదారి రాష్ట్రంలో ఉందన్నారు. కేవలం ఈ పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం అంతే మొత్తంలో రహదారులు నిర్మించిందన్నారు. దాంతో వ్యాపారులు, ఉద్యోగులతో పాటు పలు రంగాల వారికి దోహద పడిందన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించే పంటకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించింది. కాంగ్రెస్ హయాంలో కేవలం రూ.3,400 కోట్లకు మాత్రమే గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయగా.. ఎన్డీఏ సర్కార్ రూ.27,000 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ సర్కార్ హంగామా చేస్తోంది, అవినీతికి పాల్పడిందని ప్రధాని మోదీ ఆరోపించారు. సభకు వచ్చిన స్పందన చూస్తే ఈరోజు రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలకు నిద్ర పట్టదన్నారు.
రుణమాఫీ పేరుతో రైతులను మోసింది బీఆర్ఎస్ సర్కార్, దానివల్ల అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులకు అవసరమయ్యే ఎరువుల కోసం రూ.6 వేల కోట్లు ఖర్చుతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెరిచామని పేర్కొన్నారు. తెలంగాణలో పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించాం. భారతదేశంలో అధిక పసుపు తెలంగాణ ఉత్పత్తి చేస్తోంది, రైతులకు ఆదుకునేందుకు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కళలు, సంస్కృతికి తెలంగాణ వేదిక. దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి ఇక్కడ కళతో చేసిన గిఫ్ట్ ఇస్తే ప్రపంచ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. ఆదివాసీల కోసం విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఆధునిక ఉపకరణాలు అందించడంతో పాటు ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రూ.900 కోట్లతో ఏర్పాటు చేయనున్న వర్సిటీకి సమ్మక్క సారక్కగా నామకరణం చేశామన్నారు.