Minister Harish Rao : తెలంగాణకు గిరిజన వర్సిటీ ఎందుకివ్వలేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి- మంత్రి హరీశ్ రావు
Minister Harish Rao : సీఎం కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉద్యోగ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తున్నామన్నారు.
Minister Harish Rao :సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు జీఎంఆర్ కన్వెన్షన్ హాల్ లో తెలంగాణ బంజారా ఎంప్లాయిస్ సేవాసాంగ్ 25వ సిల్వార్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, ఉపాధ్యాయ MLC రగొత్తమ్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపల్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... గిరిజనులకు ఇచ్చిన ప్రతీ మాట కేసీఆర్ నిలబెట్టుకున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గిరిజనుల రిజర్వేషన్లు 6 శాతం నుంచి 10 శాతానికి పెరిగాయన్నారు. 81 వేల ఉద్యోగ నియామకాల్లోనూ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో గిరిజనుల ఆత్మగౌరవ భవనానికి ఎకరం స్థలం, రూ.23 కోట్లు ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక 75 గిరిజన కళాశాలలు ఇచ్చామని స్పష్టం చేశారు.
గిరిజన వర్సిటీ ఎందుకివ్వలేదు
"గిరిజనులను ఇతర పార్టీలు ఓటు బ్యాంకుగా చూశారు. దేశంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో 2,471 తాండలను గ్రామపంచాయతీలుగా చేశాం. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. గిరిజన యూనివర్సిటీ నిర్మాణం కోసం స్థలం రెడీగా ఉంది. లాంబాడాలకు రిజర్వేషన్లు తొలగించాలని రాష్ట్రానికి చెందిన ఓ ఎంపీ కోరుతున్నారు. మతతత్వ బీజేపీ పట్ల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అమ్మడం దారుణం." - మంత్రి హరీశ్ రావు
మెడికల్ కాలేజీ పనులపై ఆదేశాలు
తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి త్వరగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గతేడాది 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామన్నారు. ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ టీం పరిశీలనకు వచ్చేసరికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రాలను పూర్తి చేయాలని ఆదేశించారు. నిమ్స్, గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటుచేస్తున్న ఎంసీహెచ్ ఆస్పత్రులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. 23 సీహెచ్‌సీల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 20 డయాగ్నొస్టిక్ సెంటర్లు ఉన్నాయన్నారు. వివిధ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 13 సెంటర్లను త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మార్చురీల పనులు, 12 సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల సమీపంలో 9 క్రిటికల్ కేర్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.