Satyavathi Rathod: అలాంటి వ్యక్తులు ద్రోహులుగా మిగిలిపోతారు: మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ జిల్లాకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజీని అడ్డుకునే ప్రయత్నం చేసేవారు జిల్లా ద్రోహులుగా మిగిలిపోతారని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా మహబూబాబాద్ జిల్లాకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజీని అడ్డుకునే ప్రయత్నం చేసేవారు జిల్లా ద్రోహులుగా మిగిలిపోతారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ మెడికల్ కాలేజీకి ఎంపిక చేసిన స్థలం విషయంలో పేదలు నష్టపోతే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధిలో నేతలంతా కలిసి పనిచేయాలన్నారు. దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన ఆక్సిజన్ ప్లాంట్‌ను మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో సత్యవతి రాథోడ్ నేడు ప్రారంభించారు.
అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. మన జిల్లాలోనూ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం. మిషన్ సంజీవని పేరుతో ఆక్స్ ఫామ్ ఇండియా సంస్థ దేశ వ్యాప్తంగా ప్లాంట్స్ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ సైతం రూ. 1.40 కోట్ల విలువైన ఆక్సిజన్ ప్లాంట్, జనరేటర్ అందించారు. ములుగు, ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాలతో పాటు తోర్రురులో వైద్య సదుపాయాలు, హాస్పిటల్ కోసం నిధులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు..
‘మహబూబాబాద్ జిల్లాలో ఇదివరకే టి. డయాగ్నస్టిక్ సెంటర్ తెచ్చుకున్నాం. తాజాగా మనకు మెడికల్ కాలేజీ వచ్చింది. నర్సింగ్ కాలేజీకి టెండర్లు కూడా పిలిచాం. కరోనా సమయంలో ఆక్సిజన్ ఆక్సిజన్ బెడ్స్ లేక సమస్యలు ఎదుర్కొన్నాం. ఇకపై ఆ సమస్య ఉండదు. జిల్లా మెడికల్ కాలేజీకి అవసరమైన టీచింగ్ సిబ్బందిని నియమించుకుంటున్నాం. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మెడికల్ కాలేజీ ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కాలేజీ ఇస్తున్నట్లు సీఎం కేసిఆర్ ఫోన్ చేసి చెప్పారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యము లభిస్తుందని సంతోషించాను.
Also Read: ఏపీలోనే విద్యుత్ కష్టాలు..! తెలంగాణలో "పవర్" ఫుల్లేనా ?
మహబూబాబాద్ జిల్లా 551 సర్వేలో ఎవరికీ కేటాయించని, వ్యవసాయం చేయని స్థలం గుర్తించి 70 ఎకరాలలో 30 ఎకరాలు మెడికల్ కాలేజీకి ఇచ్చాం. 551 సర్వేలో 640 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 100 ఎకరాలు కూడా ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోలేదు. మెడికల్ కాలేజీతో ఇక్కడి గిరిజన, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందనుంది. కరోనా సమయంలో నా ఎంపీ నిధుల నుంచి రూ.85 లక్షలతో ఏరియా హాస్పిటల్‌లో వైద్య సదుపాయాలు కల్పించా. మెడికల్ కాలేజీ కోసం నవంబర్‌లో ఢిల్లీ నుంచి వైద్య బృందం రానుంది. ప్రజలకు మేలు చేసే మెడికల్ కాలేజీని అడ్డుకుంటే జిల్లా ద్రోహులుగా మిగిలిపోతారని’ మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించారు.
ఆ భూముల జోలికి వెళ్లొద్దు..
ఇక్కడ పోడు భూముల సమస్య ఉంది. కానీ గతంలో ప్రజలకు ఇచ్చిన భూములను అసైన్డ్ పట్టాలని వాటిని ఫారెస్ట్ అధికారులు రద్దు చేయగా.. సీఎం కేసీఆర్ వారి సమస్య పరిష్కారం కోసం యత్నిస్తున్నారు. 2005కు ముందు నుంచి పోడు చేసుకునే గిరిజనుల జోలికి అటవీ అధికారులు వెళ్లవద్దు. భవిష్యత్తులోనూ సమస్య రాకుండా ఉండేందుకు సమగ్ర సర్వే చేసి మార్క్ చేయాలని కోరుతున్నారు.