TS Vs AP Power : ఏపీలోనే విద్యుత్ కష్టాలు..! తెలంగాణలో "పవర్" ఫుల్లేనా ?
ఏపీలో విద్యుత్ సంక్షోభం గురించి విస్తృత చర్చ జరుగుతూండగా.. తెలంగాణలో మాత్రం అంతా కూల్‌గా ఉంది. తెలంగాణ విద్యుత్ విషయంలో స్వావలంబన సాధించేసిందా ?
బొగ్గు కొరత కారణంగా దేశంలో పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాయన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను ఈ విషయంలో అప్రమత్తం చేస్తోంది. డబ్బులు పెట్టి కొన్నా కరెంట్ దొరికే పరిస్థితి లేదని .. కరెంట్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సలహా ఇస్తున్నారు. ముందు ముందు కరెంట్ కోతలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి హైరానా పడటం లేదు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని కూడా చెప్పడం లేదు. తెలంగాణలో విద్యుత్ పరిస్థితి మెరుగ్గా ఉండటమే దీనికి కారణం.
ఏపీలో ఉత్పత్తికి ..వినియోగానికి మధ్య తీవ్రమైన లోటు !
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ విద్యుత్ వినియోగం రోజుకు 185 మిలియన్ యూనిట్ల నుంచి 190 మిలియన్ యూనిట్ల వరకు ఉంటోంది. ఇందులో ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు సమకూరుస్తున్న విద్యుత్ 45 శాతం మాత్రమే అంటే. 80 నుంచి 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందిస్తోంది. మిగతా అంతా ప్రభుత్వం బయట నుంచి కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం సమయాన్ని బట్టి ఒక్కో యూనిట్‌ను రూ. ఇరవై పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ జెన్‌కో థర్మల్ పవర్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 90 మిలియన్ యూనిట్లు ఉంది. అయితే ఇందులో సగం మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. సెంట్రల్ పవర్ స్టేషన్ల నుంచి రోజుకు 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కావాలి. కానీ 30 మిలియన్ యూనిట్లే ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో బహిరంగ మార్కెట్‌లో కొని అవసరాలు తీర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. డిమాండ్ పెరిగిపోవడంతో విద్యుత్ కోతలు అనధికారికంగా అమలు చేస్తున్నారు.
Also Read : తెలంగాణలో కలిసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహ్దదు ప్రాంతాల ఆసక్తి ! కారణం ఏమిటంటే ?
తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి - వినియోగం మధ్య గ్యాప్ తక్కువే..!
తెలంగాణలో 11వ తేదీన విద్యుత్ 198 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. ఈ మొత్తాన్ని ప్రజలకు సరఫరా చేసింది ప్రభుత్వం. ఇందులో తెలంగాణ జెన్‌కో ధర్మల్, హైడల్ విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా దాదాపుగా 118 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసింది. సింగరేణి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ , సెంట్రల్ పవర్ స్టేషన్ల నుంచి మరో 52 మిలియన్ యూనిట్ల వరకూ అందుబాటులోకి వచ్చాయి. ఇక 27 మిలియన్ యూనిట్లను మాత్రమే బయట నుంచి కొనుగోలు చేశారు. ఇది సహజంగా కొనుగోలు చేసేదే. అసాధారణం కాదని అధికారవర్గాలు చెబుతున్నారు. విద్యుత్ డిమాండ్ ఇంతే ఉన్నా.. మరికొంత పెరిగినా తెలంగాణకు కరెంట్ సమస్య వచ్చే అవకాశం లేదన్న అభిప్రాయం ఉన్నతాధికారవర్గాల్లో వినిపిస్తోంది. డిమాండ్‌కు ఉత్పత్తికి మధ్య తేడా తెలంగాణలో 27 మిలియన్ యూనిట్లే ఉంది.. కానీ ఏపీలో అది 70, 80 మిలియన్ యూనిట్ల వరకూ ఉంది.
Also Read : బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రులతో అమిత్ షా కీలక భేటీ
విద్యుత్ రంగంలో తెలంగాణ మెరుగైన ప్రతిభ !
రాష్ట్రం విడిపోతే తెలంగాణ విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోతుందని అప్పట్లో నిపుణులు విశ్లేషించారు. తెలంగాణలో కరెంట్ అవసరాలు చాలా ఎక్కువ. వ్యవసాయంలో అత్యధికం బోర్ల కిందనే ఉంటుంది. అదే సమయంలో పారిశ్రామికంగానూ అభివృద్ధి సాధించింది. ఈ క్రమంలో విద్యుత్ వినియోగం చాలా ఎక్కువ. కానీ ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు ఎక్కువగా ఏపీలో ఉన్నాయి. ఈ కారణంగా విద్యుత్‌ను జనాభా ప్రాతిపదికన కాకుండా అవసరాల ప్రాతిపదికన విభజన చట్టంలో పంచారు. తరవాత తెలంగాణ తీసుకుంటున్న కరెంట్‌కు డబ్బులివ్వలేదని ఆపేశారు. అయితే తెలంగాణ పట్టించుకోలేదు. విద్యుత్ ఉత్పత్తిని పెంచుకుంది. ఇప్పుడు సంక్షోభంలో మెరుగైన పరిస్థితిలో ఉంది.
Also Read : దేశంలో విద్యుత్ సంక్షోభంపై పవర్ మినిస్టర్ ఏమన్నారంటే?
తెలంగాణకు అండగా సింగరేణి బొగ్గు !
దేశంలో విద్యుత్ కొరతకు ప్రధానంగా బొగ్గు కారణంగా ఉంది. తెలంగాణలోనే సింగరేణి ఉంది. సింగరేణి ఉత్పత్తికి వచ్చిన కొరతేమీ లేదు. సింగరేణికి ప్రత్యేకంగా పవర్ ప్లాంట్ కూడా ఉంది. విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తాత్కాలిక లాభాలు చూసుకోకుండా ... దీర్ఘకాలిక ప్రయోజనాలతో ముందడుగు వేసిందని.. అందుకే సంక్షోభ స్థాయికి తెలంగాణ వెళ్లలేదని అంటున్నారు. కరెంట్ సమస్యలు ఎక్కువైతే .. పారిశ్రామిక వృద్ధి.. ప్రజల జీవనోపాధిపై ప్రభావం పడుతుంది.
Chocolates in AC Coaches: తొలిసారి ఏసీ కోచ్‌లలో చాక్లెట్లు తరలింపు.. ఎన్ని టన్నులో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి