Pawan Kalyan: పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
Janasena: పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విపక్ష నేత మాదిరిగా స్పందిస్తున్నారు. హోంశాఖ నుంచి టీటీడీ వరకూ ఆయన స్పందన అలాగే ఉంది. వ్యూహాత్మకంగా చేస్తున్నారా?

Pawan Kalyan is reacting like an opposition leader to the government: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వంపై విపక్ష పార్టీ మాదిరిగా విరుచుకుపడుతున్నారు. తాను డిప్యూటీ సీఎంను అయినా సరే బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి కొంత మందిని టార్గెట్ చేసేస్తున్నారు. తిరుమల విషయంలో టీటీడీ ఈవో, జేఈవో, చైర్మన్ లను బాధ్యులను చేశారు. వారు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. చివరికి ఈవో చెప్పారు. అధికారులు చెబుతారా లేదా అన్నది తర్వాత కానీ ఇంతగా ఎందుకు పట్టుబడుతున్నారన్నది చాలా మందికి అర్థం కాని విషయం.
పవన్ తీరుతో ప్రభుత్వానికి సమస్యలు
ఎక్కడైనా సమస్య జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన పద్దతిలో స్పందించాలి. కానీ విపక్షం మాదిరిగా వ్యవహరించకూడదు. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వంలో టీడీపీ అధికార పార్టీగా వ్యవహరిస్తుంది. జనసేన పార్టీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ విపక్ష పార్టీగా వ్యవహరిస్తున్నారు. తిరుమలలో తొక్కిసలాట జరిగిన వెంటనే చంద్రబాబు తిరుపతి వెళ్లారు. రివ్యూ చేశారు. అధికారులపై చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత తిరుపతికి వచ్చిన పవన్ కల్యాణ్.. తాను కొంత మందిని బాధ్యుల్ని చేసి వారిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వయంగా తాను కూడా చెప్పారు. ఆయన తీరు చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. చంద్రబాబు ఓ వైపు డీల్ చేస్తూంటే మరో వైపు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న ఎక్కువ మందిలో వచ్చింది. కానీ పవన్ పిఠాపురం వెళ్లి మళ్లీ అదే డిమాండ్ చేశారు.
స్వపక్షంలో విపక్షంగా మారాలని నిర్ణయించుకున్నారా ?
ప్రభుత్వం అయినంత మాత్రాన ఎప్పుడు ఏమి జరగాలో నిర్దేశించలేదు. ప్రభుత్వానికి ఆ పవర్ ఉండదు. ముఖ్యంగా విపత్తులు అనేవాటిని ఏ ప్రభుత్వమూ ఏమీ చేయలేదు. వాటిని ఎంత సమర్థంగా ఎదుర్కోవడమన్నదే ముఖ్యం. తిరుపతిలో జరిగిన ఘటనలో అక్కడ అసలు అలాంటి దుర్ఘటన జరగాల్సిన పని లేదు. ఓ డీఎస్పీ అనాలోచితంగా చేసిన పని వల్ల ఆ ఘటన జరిగింది. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని భక్తులు చెబుతున్నారు. అలాగే కొన్ని కేసుల విషయంలో యంత్రాంగం స్పందన కూడా పవన్ వ్యతిరేకంగా స్పందిస్తూ ఉంటారు. ఆయన మాటలు ప్రభుత్వం పనితీరునే ప్రశ్నించేలా ఉంటాయి. ప్రభుత్వంలో ఉండి కూడా ఏం జరుగుతుందో తెలుసుకునే చాయిస్ ఉండి కూడా పవన్ ఇలా మాట్లాడటంపై రాజకీయవర్గాల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతూ ఉంటుంది.
పదిహేనేళ్ల పాటు పొత్తు ధర్మం పాటిస్తానని ప్రకటనలు
ఓ వైపు కూటమిని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తూనే ఉన్నారు. కానీ ఆయనను కూటమి పార్టీల్లోని నేతలు ఒక్కరకంటే ఒక్కరు కూడా బహిరంగంగా తప్పు పట్టడం లేదు.తోటి మంత్రులు తమను పవన్ కల్యాణ్ అవమానిస్తున్నారని, కించ పరుస్తున్నారని ఫీలయినా బయటకు కనిపించనివ్వడం లేదు. పవన్ కల్యాణ్ మనసులో ఎలాంటి ఇతర రాజకీయాలు లేవని..ఆయన డిప్యూటీ సీఎం రోల్ లో కొత్త కాబట్టి అలా స్పందిస్తున్నారని సర్దుకుపోతున్నారు.కానీ పవన్ కల్యాణ్ ఇలాంటి విషయాలను పట్టించుకోవడం లేదని.. ఆయన తీరులో ఆయన వెళ్తున్నారని అంటున్నారు. ఇలా కూటమి ఏలుబడినే ప్రశ్నించేలా వ్యాఖ్యలు చేస్తే ్.. బంధంలో కనిపించని పగుళ్లు వస్తాయని అంటున్నారు. మరి పవన్ ఎందుకిలా అంటున్నారో ఆయనకే తెలియాలి.
Also Read: 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

