Hottest Year: భూమిపై సూర్యుని ప్రతాపం, అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డ్ - నాసా హెచ్చరిక
Hottest Year : 2024 అత్యంత వేడిగా ఉన్న సంవత్సరంగా రికార్డ్ సృష్టించింది. ఇది 2023 రికార్డును మించిపోయింది. నాసా అంచనా ప్రకారం ఈ సంవత్సరం 19వ శతాబ్దం మధ్య సగటు కంటే 2.65°F (1.47°C) వెచ్చగా ఉంది.

Hottest Year 2024: భూమి రోజురోజుకూ మరింత వేడెక్కుతోంది. ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతూ జీవజాతులను అతలాకుతలం చేస్తున్నాయి. అందుకు ఉదాహరణగా తాజాగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది. 15నెలల రికార్డును తిరగరాస్తూ 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైందని నాసా శాస్త్రవేత్తలు, ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) వెల్లడించింది. ఆరు అంతర్జాతీయ డేటాబేస్ లను ఆధారంగా చేసుకుని అధ్యయనం చేసిన డబ్ల్యూఎమ్వో.. గత పదేళ్లలో నమోదైన ఉష్ణోగ్రతలను బట్టి చూస్తే 2024లో అత్యంత ఎక్కువ టెంపరేచర్స్ నమోదైనట్టు ప్రకటించింది. సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం భవిష్యత్తులో ప్రమాదాలు పొంచి ఉన్నాయనే పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి.
రికార్డ్స్ బద్దలు కొడుతోన్న ఉష్ణోగ్రతలు
2024లో ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.6 డిగ్రీ సెల్సియస్ గా నమోదయ్యాయని చాలా వాతావరణ మానిటరింగ్ ఏజెన్సీలు తెలిపాయి. సాధారణంగా ప్రపంచ ఉష్ణోగ్రత సగటున 1.5 డిగ్రీ సెల్సియస్ దాటకూడదు. కానీ ఈ సగటు గణాంకాలను 2024 సంవత్సరం దాటేసిందని కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ ఇటీవలే ఓ నివేదిక జారీ చేసింది. 2023లోనూ ఇదే తరహా పరిస్థితులున్నప్పటికీ 2024 దాని రికార్డును బద్దలు కొట్టింది. ఈ మైలురాయి వరుసగా 15 నెలల రికార్డును (జూన్ 2023-ఆగస్టు 24) సూచిస్తోంది. 1880లో రికార్డ్ క్రియేట్ చేయడం నుంచి 2024 హాటెస్ట్ ఇయర్ గా నమోదైందని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ అన్నారు.
2024 was the warmest year on record. Our experts work with @NOAA scientists to track Earth’s average temperature, relying on millions of measurements worldwide. They found this year was hotter than any since at least 1880, the result of human activities: https://t.co/bVchhDzQku pic.twitter.com/tBWymaFYOT
— NASA (@NASA) January 10, 2025
వాతావరణ మార్పులతో పెను ముప్పు
వాతావరణంలో నెలకొంటున్న మార్పులు అనేక పెను ప్రమాదాలకు కావచ్చని డబ్ల్యూఎమ్వో సెక్రటరీ-జనరల్ సెలెస్ట్ సౌలో చెప్పారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10ఏళ్ల రికార్డును బీట్ చేస్తూ 2024 అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా నిలవడం వినాశకరమైన, విపరీతమైన వాతావరణ పరిస్థితులు, మంచు ద్రవీభవనానికి దారి తీస్తుందన్నారు. నాసా అంచనా ప్రకారం 2024లో 19వ శతాబ్దపు మధ్య సగటు (1850-1900) కంటే దాదాపు 2.65°F (1.47°C) వేడిగా ఉన్నట్టు తెలుస్తోంది.
రికార్డు స్థాయిలో పెరిగిన కార్బన్ ఉద్గారాలు
వాతావరణంలో పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయువులు భూమి వేడెక్కడానికి దోహదపడతాయి. 2022, 2023 సంవత్సరాలలో, శిలాజ ఇంధనాల నుండి రికార్డ్ స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు వెలువడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వాతావరణలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు 18వ శతాబ్దంలో మిలియన్‌కు 278 భాగాలు ఉండగా.. నేడు మిలియన్‌కు 420 భాగాలకు పెరిగాయని నాసా తెలిపింది. 2023 చివరలో ఏర్పడిన బలమైన ఎల్ నినో 2024లో రికార్డు స్థాయిలో వేడిని పెంచడానికి దోహదపడిందని చెప్పింది.
2025లోనూ ప్రకృతి వైపరిత్యాలు తప్పవా
వాతావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో జరిగే పెను ప్రమాదాలకు మనమే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. కావున ప్రకృతి ప్రకోపం మరింత పెరిగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో చెలరేగిన అగ్నికీలలే ఇందుకు ప్రధాన ఉదాహరణగా నిలుస్తోంది. ప్రపంచ దేశాలన్నీ 2015 వాతావరణ పరిరక్షణ కోసం చేసుకున్న పారిస్ ఒప్పందాన్ని ఇకనుంచైనా సీరియస్ గా పాటించాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

