Adilabad News: వెడ్మ ఫౌండేషన్ కు, డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కు సంబంధం లేదు: ఖానాపూర్ ఎమ్మెల్యే
Khanapur MLA Vedma Bojju | వెడ్మ ఫౌండేషన్ కు, డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కు సంబంధం లేదు అనీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.

Vedma Foundation News | ఆదిలాబాద్: వెడ్మ ఫౌండేషన్ కు డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కు ఎటువంటి సంబంధం లేదని, బీజేపీ, బిఆర్ఎస్ నాయకులు తనను బద్నాం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పెన్ గంగా అతిథి గృహంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. ఇటీవల డిజిటల్ మైక్రోఫైనాన్స్ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులను మోసం చేసి పరారైన కృష్ణ అనే వ్యక్తికి తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొన్ని మీడియా, యూట్యూబ్ ఛానెల్ లు డిజిటల్ మైక్రోఫైనాన్స్ కు వెడ్మ ఫౌండేషన్ కు సంబంధం ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ లపై పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.
పేదవాడు ఎమ్మెల్యేగా గెలవడం సహించక..
పేదలకు సేవ చేయాలనే దృక్పథంతో వెడ్మ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశామన్నారు. ఓ ప్రజా ప్రతినిధి అయిన నా వద్ద అందరూ కలవడానికి వస్తారని, ఫోటోలు దిగుతారని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటారని వారు ఏదైనా తప్పుడు పని చేస్తే బాధ్యత వహిస్తామా అని ప్రశ్నించారు. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ ఆఫీసు ప్రారంభోత్సవానికి వెళ్ళిన ప్రజా ప్రతినిధులను సోషల్ మీడియాలో ఎందుకు ప్రచారం చేయడం లేదని అన్నారు. ఒక పేదవాడు ఎమ్మెల్యేగా గెలవడం సహించని వారు ఇలాంటి అసత్య ప్రచారాలను అంటగడుతున్నారని, దమ్ముంటే అభివృద్ధి విషయంలో పోటీ పడాలన్నారు.

బీజేపీ, బిఆర్ఎస్ నాయకులు పని గట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తే సహించబొమని తెలిపారు. తప్పు ఎవరూ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్బాల్, మాజీ సర్పంచ్ మర్సుకోల తిరుపతి, నాయకులు దాసండ్ల ప్రభాకర్, సయ్యద్ కరీం, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.





















