Adilabad News: ZPHS విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Telangana News | ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ద్వారా విద్యార్ధులతోనే సమాజంలో మార్పు రావాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం నాడు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు.

Adilabad Collector had lunch with students | ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని అంకోలీ ZPHS పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా మూడవ శనివారం నిర్వహిస్తున్న ఆరోగ్య జాతర గ్రామసభలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య జాతర కార్యక్రమంలో విద్యార్ధులు గ్రామసభ, డ్రగ్స్ పై ప్రదర్శించిన ప్రదర్శనను తిలకించి అభినందించారు. స్టూడెంట్ చాంపియన్ లకు సర్టిఫికెట్ లు అందించారు.
విద్యార్ధులతో కలసి Adilabad కలెక్టర్ భోజనం
అనంతరం న్యూట్రీ గార్డెన్ ఆరోగ్య తోటలో, వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటి, మధ్యాహ్నం భోజనం మెనూ ప్రకారం ఉందా, లేదా పరిశీలించి విద్యార్ధులతో కలసి భోజనం చేశారు. విద్యార్థులు సైతం కలెక్టర్ తో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. పాఠశాలలో పెడుతున్న భోజనం బాగుందని కలెక్టర్ తో తెలిపారు. ఆపై సివిల్ సప్లై ద్వారా సరఫరా అవుతున్న బియ్యాన్ని పరిశీలించి, వివరాలను ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

చెడు అలవాట్లకు వ్యతిరేకంగా విద్యార్థుల ప్రదర్శనలు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ద్వారా విద్యార్ధులతోనే సమాజంలో మార్పు, మంచి ఆరోగ్య అలవాట్లు, చెడు అలవాట్లు దరిచేరకుండా ఈ కార్యక్రమం ద్వారా విద్యార్ధులకు అవగాహన కల్పించి, భవిష్యత్తులో వారు ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, విద్యార్ధులు డ్రగ్స్ పై చేసిన స్క్రిప్ట్ చాలా బాగుందని, మంచి ఆరోగ్య అలవాట్లతో చదువుకొని భవిష్యత్తులో మంచి స్థానాలకు చేరుకున్నారని, చెడు వ్యసనాలకు బానిసై సరిగా చదువుకోలేక భవిష్యత్తులో ఎదగలేకపోయారన్న విద్యార్ధులు చేసిన ప్రదర్శనను అభినందించారు. విద్యార్థి దశలోనే మంచి నడవడికతో, చదువు పై దృష్టి కేంద్రీకరించి ఉన్నత స్థానాలకు ఎదగాలని, మరొకరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని, అందుకు ఇప్పటి నుండే కష్టపడి చదవాలని, మంచి మార్గం లో నడవాలని హితువు పలికారు.

ప్రతీ నెల మూడవ శనివారం ఆరోగ్య జాతర
ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో ప్రతి రోజూ ఆరు అంశాలపై అవగాహనతో పాటు వినూత్నంగా ప్రతీ నెల మూడవ శనివారం ఆరోగ్య జాతర కార్యక్రమాలు నిర్వహిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులతో గ్రామసభ ఎలా నిర్వహిస్తారు, గ్రామసభలో సమస్యల పరిష్కారం, అందులోని అంశాల పై స్క్రిప్ట్ వివిధ అంశాలపై ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ప్రత్యేక అధికారి, ప్రధానోపాధ్యాయులు నర్సయ్య, ఉపాద్యాయులు, విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.





















