RS Praveen Kumar: సర్పంచుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వమే కారణం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బహుజన రాజ్యాధికార రెండవ విడతలో భాగంగా 179వ రోజు ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం కడెం, ఉట్నూర్ మండలాల్లో డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వందల ఏళ్లుగా నివసిస్తున్న గిరిజనేతరులు అన్యాయానికి గురవుతున్నారని, ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో విఫలం అయిందని డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార రెండవ విడతలో భాగంగా 179వ రోజు ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం కడెం, ఉట్నూర్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ,ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్సీ, బిసి, మైనారిటీల భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.వారు కూడా అడవిని నమ్ముకుని బతుకున్నారని పేర్కొన్నారు. బహుజన రాజ్యంలో గిరిజనేతరులకు గిరిజనులతో సమాన హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కార్పోరేషన్ రుణాలు ఎందుకు ఇవ్వడం లేదు
ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ లకు కార్పోరేషన్ రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.లక్షలాది మంది దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారని తెలిపారు.వీరికి లోన్లు ఇవ్వకుండా,ఓట్ల కోసం దళితబంధు వంటి పథకాలు పెట్టి మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్ల పాలనలో 5 లక్షల కోట్ల అప్పు చేసిందని,కానీ ఆ అప్పుతో ప్రజల బతుకులు మాత్రం మార్చడం లేదన్నారు.ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడలేదన్నారు. ఈ లక్షల కోట్లు దీనికోసం ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
కట్టిన కొన్ని ప్రాజెక్టులన్ని ఆంధ్రులకు అప్పజెప్పారన్నారు.
ఆదివాసులను మోసం చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు
ఏసీడీ పేరుతో అధికంగా విద్యుత్ చార్జీలు వసూలు చేయడాన్ని ఖండించారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేసిందని తెలిపారు. 20 వేల కోట్లు కావాల్సిన చోట, కేవలం ఆరు వేల కోట్లు కేటాయించి మరోసారి మోసం చేసిందని గుర్తు చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో గత 25 ఏళ్లుగా కరెంటు లేకుండా ప్రజలు బతుకుతున్నారని, ప్రభుత్వం టైగర్ రిజర్వ్ పేరుతో ఊర్లను ఖాళీ చేయాలని చూస్తుందన్నారు. ఇళ్లు, భూమి ఇస్తామని సంతకాలు తీసుకొని ఆదివాసులను మోసం చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్లు ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. పేదలకు న్యాయం జరగాలంటే పేద వర్గాలకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కూర్చోవాలన్నారు. అందుకు ప్రజలంతా బిఎస్పి పార్టీని ఆదరించి, ఏనుగు గుర్తును గెలిపించాలని కోరారు. యాత్రలో భాగంగా ఉట్నూర్ మండలంలోని దంతన్ పల్లి, కడెం మండలంలోని రాంపూర్, ఉడుంపూర్, జన్నారం మండలంలోని మురిమడుగు, మందపల్లి, కామన్ పల్లి, జన్నారం, గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి,జిల్లా అధ్యక్షులు రాజేందర్,నిర్మల్ జిల్లా నాయకులు జగన్, ఖానాపూర్ అసెంబ్లీ నాయకులు బన్సీలాల్ రాథోడ్,రాజేష్,మహిళా నాయకురాలు లక్ష్మీ, హారతి, మండల నాయకులు రమేష్ నాయక్, బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నందిపేట్ సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని మంట అంటించుకునేందుకు ప్రయత్నించారు. అక్కడున్న పోలీసులు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వేధింస్తున్నారని సర్పంచ్ దంపతులు ఆరోపిస్తున్నారు. పెండింగ్ బిల్లులు రావడం లేదని మనోవేదనకు గురైన నందిపేట్ సర్పంచ్, ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. నందిపేట్ కు చెందిన సర్పంచ్ సాంబార్ వాణి, భర్త తిరుపతి(వార్డ్ మెంబర్) తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యయత్నం చేశారు.