Armoor Ex MLA Jeevan Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి హైకోర్టులో ఊరట, అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు
BRS Ex MLA Jeevan Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట కలిగింది. ఆయనతో పాటు కుటుంబసభ్యులను అరెస్ట్ చేయవద్దని కోర్టు తీర్పు ఇచ్చింది.
Telangana High Court on Ex MLA Jeevan Reddy| బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భూమిని కబ్జా చేశారన్న ఆరోపణలు, ఫిర్యాదుతో జీవన్ రెడ్డి (Armoor Ex MLA Jeevan Reddy)తో పాటు ఆయన కుటుంబసభ్యులపై చేవెళ్ల, మొకిల పోలీస్ స్టేషన్‌లలో పలు సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. ఆ కేసును సవాల్ చేస్తూ, తనను, తన కుటుంబసభ్యులను అరెస్ట్ చేయకుండా మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు కోర్టును కోరారు. వాదనలు విన్న అనంతరం జీవన్ రెడ్డి కుటుంబసభ్యులను అరెస్ట్ చేయవద్దని పోలీసులును హైకోర్టు ఆదేశించింది.
జీవన్ రెడ్డిపై భూ కబ్జా కేసులు నమోదు
దామోదర్ రెడ్డి అనే వ్యక్తి 2022లో ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. అందులో సర్వే నెంబర్ 32, 35, 36, 38 లో ఓ ఫంక్షన్ హాల్ నిర్మించారు. ఆయన భూమి పక్కనే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూమి ఉంది. 2023లో ఆ ఫంక్షన్ హాల్ ను జీవన్ రెడ్డి తన మనుషులతో కూల్చివేయించి, ఆ భూమిని కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. తన ఫంక్షన్ హాల్ కూల్చివేయడంతో పాటు భూమిని ఆక్రమించుకున్నారని బాధితుడు దామెదర్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కబ్జా కేసు పెట్టాడు. తన ఫంక్షన్ కూల్చివేసి, భూమిని లాక్కోవడంపై నిలదీయడానికి వెళ్లిన తనపై జీవన్ రెడ్డి గ్యాంగ్ దాడి చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఊరట కలిగించిన కోర్టు తీర్పు
జీవన్ రెడ్డిపై చేవెళ్ల, మొకిల పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. పోలీసులు తనను, తన కుటుంబసభ్యులను అరెస్ట్ చేస్తారేమోనని జీవన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. తనపై అక్రమంగా కేసులు బనాయించారని, తనను, కుటుంబసభ్యులను అరెస్ట్ చేయకుండా చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తాత్కాలికంగా జీవన్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, అరెస్ట్ చేయకూడదని హైకోర్టు తీర్పుతో ఊరట కలిగింది. ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది అంటూ జీవన్ రెడ్డి స్పందించారు.
అద్దె బకాయిలు రూ. 2.50 కోట్ల నగదు చెల్లించకపోవడంతో ఆర్మూరు బస్ స్టేషన్ సమీపంలోని జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్‌ను సీజ్ చేయడం తెలిసిందే. ఆర్టీసీ అధికారులు ఆయన షాపింగ్ మాల్ గేటుకు తాళం వేశారు . ఆ బిల్లు బకాయిల ఘటన మరువక ముందే భూ కబ్జా ఆరోపణల వివాదంలో చిక్కుకున్నారు.