Ration Rice: ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రకు రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఈ మాఫియాను కట్టిడి చేసేదెలా?
Telangana News | తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రకు సైతం రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. అధికారుల తనిఖీలలో రేషన్ బియ్యం దందా బయటపడినా భారీ చర్యలు ఉండటం లేదని చెబుతున్నారు.
Ration Rice illegal export to maharashtra from adilabad district | ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ రేషన్ దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు రేషన్ బియ్యాన్ని అక్రమ మార్గంలో తరలిస్తూ కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు పక్కనున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఈ రేషన్ దందా జోరుగా కొనసాగుతోంది. పలు రైస్ మిల్లుల నుంచి, అలాగే పలుచోట్ల రేషన్ డీలర్ షాపుల్లో రాయితీ దారుల నుండి తీసుకున్న బియ్యాన్ని కొంతమంది తక్కువ ధరకు తీసుకొని పెద్దఎత్తున నిల్వ చేసుకొని అధికారులకు మామూళ్లు ఇస్తు జిల్లాలు దాటి పక్కనున్న రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ తతంగం కొనసాగుతోంది. దీనికి తోడు కొంతమంది అధికారులు, ప్రజా ప్రతినిధుల అండ ఉండటంతో రేషన్ మాఫియాకు హద్దు లేకుండా పోతుంది. జోరుగా తమ పని కానిచ్చేస్తున్నారు. నెల రెండు నెలలకోసారి ఏదో ఒక చోట అపుడప్పుడు అక్కడక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పట్టుబడుతున్నారు.
ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రకు రేషన్ బియ్యం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి చంద్రపూర్ బల్లార్ష, గొండియా కు, మంచిర్యాల చెన్నూర్ మీదుగా మహారాష్ట్రలోని సిరోంచ కు బియ్యం తరలిస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాన్నారం, ఖానాపూర్, నిర్మల్ మీదుగా మహరాష్ట్రలోని హిమాయాద్ నగర్, కిన్వట్, యవత్మాల్, లాతూర్, నాందేడ్ కు, జన్నారం, ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, మీదుగా మహారాష్ట్రాలోని జీవితి, గడ్ చందూర్ కు లేదా ఉట్నూర్, ఇంద్రవెళ్ళి నుంచి గుడిహత్నూర్, ఇచ్చోడ, సోనాల మీదుగా కిన్వట్ కు, అదే తరహాలో ఆదిలాబాద్ మీదుగా బోరి ఇంగన్ ఘాట్ మీదుగా నాగ్ పూర్, గోండియాకు తరలిస్తున్నారు. రాయితీ బియ్యం పక్కదారి పడుతున్న అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహారిస్తున్నారు. ఈ తతంగానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. చోటా లీడర్ల నుంచి పెద్ద లీడర్ల వరకు చోట అధికారుల నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు సివిల్ సప్లై అధికారుల వరకు కూడా ఈ మాఫియా మనుషులు ముడుపులు చెల్లిస్తూ తమ పనిని మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగిస్తున్నారు.
ఏదో ఒకచోట అప్పుడప్పుడు మెరుపు దాడులు నిర్వహిస్తున్న సమయంలో దొరికిపోతున్నారు. కానీ పూర్తిస్థాయిలో ఈ అక్రమ దందాకు చెక్ పెట్టేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని స్థానికంగా వినిపిస్తోంది. అందుకే గత కొన్ని నీళ్లు గా చోటా బడా నేతల పేర్లు, అధికారులు పేర్లు అక్కడక్కడ బయటకు వస్తున్న వాటిని అక్కడే కప్పిపుచ్చుతున్నారు. గత ప్రభుత్వ హయంలో పెద్ద ఎత్తున కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బియ్యం కుంభకోణం జరిగింది. పేదల కోసం ప్రభుత్వం ఈ రాయితీ బియ్యాన్ని సప్లై చేస్తుంటే, పెద్దలు అభియాన్ని పక్కదారి పట్టించి కోట్లు దుండుకుంటున్నారు.
గత రెండు రోజుల వ్యవధిలో స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం వివరాలు
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్.జీవన్ రెడ్డికి రేషన్ బియ్యం రవానాపై సమాచారం వచ్చింది. బోరజ్ చెక్ పోస్ట్ వద్ద పిడిఎస్ రైస్ రాయితీ బియ్యం తరలిస్తున్నారన్నా సమాచారంతో జైనథ్ సిఐ, జైనథ్ ఎస్సై తనిఖీలు నిర్వహించారు. రేషన్ బియ్యం నిర్మల్ నుంచి మహారాష్ట్రలోని గొండియా జిల్లాకు తరలిస్తున్నారని తెలిసింది, ఇవి దాదాపు 280 క్వింటాళ్ళు ఉంటాయని జైనథ్ సిఐ తెలిపారు. జైనథ్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టగా నిర్మల్ లోని అన్నపూర్ణ రైస్ మిల్ ట్రేడర్స్ వద్ద నుంచి మహారాష్ట్రలోని గొండియా జిల్లా విలాస్ రైస్ మిల్లుకు తరలిస్తున్నారని డ్రైవర్ తెలపగా వీరిపై కేసు నమోదు చేసినట్లు జైనథ్ డి.సాయినాథ్ తెలిపారు. తదుపరి ఈ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారికి అందజేశారు.
అటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలంలోని కొండపల్లి, అగర్ గూడ గ్రామాల నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు స్థానిక పోలీసులు, విజిలెన్స్, ఇన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేయగా.. ప్రధాన రహదారిపై వెళుతున్న బొలెరో వాహనంలో 21 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని స్వాధీన పరుచుకుని బొలెరో డ్రైవర్ పాముల మహేష్ ను విచారించగా కాగజ్ నగర్ కు చెందిన సయ్యద్ సహాబాజ్ కు చెందిన వాహనమని దీనిలో అమీర్, రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులు బియ్యాన్ని సేకరించి మహారాష్ట్రకు తరలిస్తున్నారని తెలిపారు. ఈ వ్యాపారానికి పవన్, ఆవేజ్ ఖాన్ లు సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొమురయ్య తెలిపారు. ఈ బియ్యాన్ని సివిల్ సప్లై గోదాముకు అప్పగించిన్నట్లు ఆయన తెలిపారు.
Also Read: గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు, వారి కుటుంబానికి రూ.5 లక్షల సాయం!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద ఎత్తున బియ్యం అక్రమ రవాణాను కేవలం పోలీసులు పట్టుకొని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. ఇదే తరహాలో సంబంధిత శాఖ అధికారులు పటిష్ట భద్రత నిఘా ఏర్పాటు చేసినట్లయితే రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టవచ్చని పలువురు మేధావులు చెబుతున్నారు. మరి ఈ ప్రభుత్వం రేషన్ అక్రమ దందాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.