Telangana: గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు, వారి కుటుంబానికి రూ.5 లక్షల సాయం!
Telangana News | గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ ఇబ్బంది పడుతున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి గల్ఫ్ కార్మికుల సంక్షేమ కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నారు.
Gulf Workers welface committee | హైదరాబాద్: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే ప్రాంతాల ఎమ్మెల్యేలు, నేతలతో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, చనిపోయిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించాలని చర్చించారు. ప్రజావాణిలో గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ వినోద్ ఆధ్వర్యంలో మొత్తం 5 అంశాలపై చర్చించారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గల్ఫ్ కార్మికుల కమిటీలో గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈ కమిటీలో సభ్యులుగా నియమించాలని.. ఈ మేరకు జీవో విడుదల చేయాలని సూచించారు.
హైదరాబాద్ ప్రజాభవన్ (Praja Bhavan)లో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి (Prajavani)లో గల్ఫ్ కార్మికుల కోసం ప్రవాసి ప్రజావాణి నిర్వహించడంపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే (Jyotirao Phule) ప్రజా భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సెప్టెంబర్ 20 నుంచి గల్ఫ్ కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని చెప్పారు. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలలో, కళాశాలలో చదవాలని అనుకునే వారికి 100 శాతం అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చేలా సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గతంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సైతం రూ. 1 లక్ష ఎక్స్ గ్రేషియ ఇవ్వాలని NRI సెల్ సూచించింది. తెలంగాణ ఏర్పాటైన జూన్ 2 , 2014 లేదా ఎప్పటినుంచి తీసుకోవాలనే దానిపై కమిటీలు పలు సూచనలు చేశాయి.
గల్ఫ్ లో మృతి చెందిన వేములవాడ నియోజకవర్గానికి చెందిన 2 కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ (Telangana CMRF) నుంచి ఎక్స్ గ్రేషియా ఇచ్చామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రైతు భీమా మాదిరి గల్ఫ్ భీమా ఉండాలని పలువురు ఎమ్మెల్యేలు సైతం సూచించారు. ఇటీవల సింగపూర్, మలేషియాలలోని కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పగా.. టీపిసిసి ఎన్ఆర్ఐ కన్వీనర్ ఇమిగ్రేషన్ 1982 యాక్ట్ లో గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) 18 దేశాలు ఉంటాయి. సింగపూర్ లాంటి దేశాలు కూడా గల్ఫ్ కిందకి వస్తాయని కొందరు బదులిచ్చారు.
తెలంగాణ లో 150 ట్రెడ్ లైసెన్స్ మన్ పవర్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలు ఉన్నాయి. టాంటం, న్యాక్, సెట్వీన్ లాంటి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలనీ సూచించారు. ఏజెన్సీల పేరుతో మోసం జరుగుతుందని, ఇకపై అలా జరగకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇప్పటివరకూ గల్ఫ్ కార్మికులు ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని ఇక్కడికి రప్పించడానికి 7 రోజులకు పైగా పడుతోందని.. కనీసం 48 గంటల్లో డెడ్ బాడీ వచ్చేలా చూడాలని కోరారు. కేరళ రాష్ట్రంలో దేశంలో బెస్ట్ గల్ఫ్ పాలసీ ఉందని, వారి పాలసీని అధ్యయనం చేయాలని సమావేశంలో చర్చించారు. కేరళలో గల్ఫ్ కార్మికుల ద్వారా జీడీపీకి చాలా వస్తుందని తెలంగాణలో కూడా జీడీపీ గల్ఫ్ కార్మికుల ద్వారా అభివృద్ధి జరగేలా చర్యలు తీసుకోవాలన్నారు.