(Source: ECI/ABP News/ABP Majha)
Prashanth Reddy: ఉద్యోగుల సహకారంతోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ : మంత్రి వేముల
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులను తాము ఎన్నడు కూడా వేరు చేసి చూడలేదని, వారితో ప్రభుత్వానికి ఉన్నది పేగు బంధం అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
TS Minister Prashanth Reddy: తెలంగాణ అనే పదానికి టీ ఎన్జీఓలు మారుపేరుగా నిలుస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులను తాము ఎన్నడు కూడా వేరు చేసి చూడలేదని, వారితో ప్రభుత్వానికి ఉన్నది పేగు బంధం అని మంత్రి స్పష్టం చేశారు. టీ ఎన్ జీ ఓ ల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్ లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయoలో ఆవిష్కరించారు.
రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అమోఘం
ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర అమోఘమని, 1967 నాటి ఉద్యమంలోనూ ఆమోస్ నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులతో కలిసి పోరాడే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నామని, తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగులు ఉత్ప్రేరకంగా నిలిచారని కొనియాడారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పట్ల ఎల్లవేళలా ఉదార స్వభావంతోనే వ్యవహరిస్తారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందంటే, అందుకు ఉద్యోగుల కృషి ప్రధాన కారణమని అన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను, సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ అట్టడుగున ఉన్న ప్రజల వరకు తీసుకెళ్తున్నారని, ఫలితంగానే అభివృద్ధి చెందిన గ్రామాల సర్వేలో దేశంలోనే ఇరవైకి గాను 19 గ్రామ పంచాయతీలు తెలంగాణకు చెందినవే ఎంపికయ్యాయని గుర్తు చేశారు. వీటిలో ఒక్క నిజామాబాదు జిల్లాలోనివే ఐదు గ్రామాలు ఉన్నాయని తెలిపారు.
తలసరి ఆదాయం రూ.2 .78కు పెరిగింది
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఎంతో అంకితభావంతో, పారదర్శకంగా ఉద్యోగులు అమలు చేయడం వల్లే ఈ ఘనత దక్కిందన్నారు. ఉద్యోగుల తోడ్పాటుతో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలోనూ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు మంత్రి వేముల. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి తలసరి ఆదాయం రూ. లక్షా 28 వేలు ఉంటే, ప్రస్తుతం అది రూ.2 .78 లక్షలకు పెరిగిందన్నారు. ఆదాయ వృద్ధిలోనూ జాతీయ స్థాయిలో వృద్ధిరేటు 9 శాతం ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో 16 శాతం ఉందని వివరించారు. దేశంలోనే ఉద్యోగులకు అత్యధిక జీతాలు అందిస్తున్నది కూడా తెలంగాణ రాష్ట్రమేనని, ఇది తమకు ఎంతో గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఇదే స్పూర్తితో ఉద్యోగులు ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీలకు, రాజకీయాలకు, అతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలంలో ఆదివారం ఒక్కరోజే సుమారు 6 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. అభివృద్ది చేస్తున్నది ఎవరు మాటలు చెప్తున్నది ఎవరు అని ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. ధర్మపురి అరవింద్ ను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలకు ఏమైనా మంచి చేయాలి కానీ తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తిట్టిన పర్వాలేదు కానీ ప్రజలకు మంచి చేయాలని సూచించారు.