Nizamabad: బోధన్‌లో కల్తీ కల్లు కలకలం.. జాతరలో సంబరాలు చేసుకున్నారు.. గంటల వ్యవధిలో ఆస్ప్రత్రిపాలయ్యారు
వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా కల్లు విక్రయాలు పెద్దఎత్తున చేపట్టారు. ఎక్కువ మొత్తంలో కల్లు విక్రయాలు జరిపేందుకు కల్తీకల్లు తయారు చేసినట్లు సమాచారం. కల్తీ కల్లు తాగి కొందరు అస్వస్థతకు లోనయ్యారు.
తెలంగాణలో కల్లు సేవించడం ఎప్పటినుంచో ఉంది. కొన్ని వర్గాల వారు సంప్రదాయంగా కుటుంబం మొత్తం కలిసి కల్లు సేవిస్తుంటారు. అయితే కల్తీ కల్లు అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. కల్తీ కల్లు ముఠా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎంత పని చేసినా సరే సాయంత్రానికి ఓ సీసా కల్లు తాగితే చాలు అరోగ్యానికి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అని ప్రజలు భావిస్తుంటారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సంగం గ్రామంలో కల్తీకల్లు కలకలం సృష్టించింది. కల్లు మూస్తేదారు కల్తీకల్లు అమ్మటంతో ఒక్కసారిగా పది మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా విక్రయాలు పెద్దఎత్తున చేపట్టారు. జాతర కావడంతో ఎలా ఉన్నా తాగేస్తారులే అని భావించి కల్లు మూస్తేదారు కల్తీకల్లు విక్రయించారు. పండగ పూట స్థానికులు ఆనందంగా కల్లు సేవించారు. కానీ కల్లు తాగిన కాసేపటికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
తలనొప్పి, నాలుక మొద్దు బారిపోవడం లాంటి లక్షణాలు కనిపించాయి. కల్తీ కల్లు సేవించి అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం బోధన్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కల్తీకల్లు బారిన పడి ఆయా ఆస్పత్రుల్లో మరికొంత మంది చికిత్స పొందుతున్నారు. కల్లు మూస్తేదార్లు ఎక్కువ మొత్తంలో కల్లు విక్రయాలు జరిపేందుకు కల్తీకల్లు తయారు చేసినట్లు సమాచారం. కల్తీకల్లు అమ్మకాలు జరిపిన వారిపై ఎక్సైజ్ అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చికిత్స పొందుతున్న వారికి వైద్య ఖర్చులకు సహాయం చేయాలని స్థానిక నేతలను, ప్రభుత్వాన్ని కోరారు.
కాయకష్టం చేసే వారు తక్కువ ధరకు దొరికే మద్యం కల్లుతో సేదతీరుతుంటారు. అందులోనూ చిన్నపాటి సంబురం జరిగినా తమకు తోచిన విధంగా కల్లును సేవిస్తుంటారు. కుటుంబంతో కలిసి ఇంటికి తీసుకెళ్లి తాగడం తెలిసిందే. వేంకటేశ్వరస్వామి జాతర సందర్భంగా బోధన్ మండలం సంగం గ్రామంలో కల్లు సేవించిన వారు ప్రాణాలమీదకి తెచ్చుకున్నారు. కల్తీ కల్లు విక్రయించే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Kunrool Call Money: కర్నూలు జిల్లాలో కాల్ మనీ కలకలం... వడ్డీ వ్యాపారులు వేధింపులతో భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం
Also Read: Drugs in Gujarat: గుజరాత్‌లో మరోసారి మత్తు భూతం.. పాక్ బోటులో రూ.400 కోట్ల డ్రగ్స్ సీజ్