మన ఊరు మనబడి - కార్పొరేట్ కు దీటుగా గవర్నమెంట్ స్కూల్
మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, సిర్పూర్ (టి) నియోజకవర్గ శాసనసభ్యులు కోనేరు కోనప్పతో కలిసి ప్రారంభించారు.
- ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
- జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు
- మన ఊరు మనబడి పాఠశాల ప్రారంభోత్సవం
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం దోహదపడుతుందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. మన ఊరు మన బడిలో భాగంగా కాగజ్‌నగర్ పట్టణంలో సర్ సిల్క్ లో 32.74 లక్షల వ్యయంతో పనులు చేపట్టిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, సిర్పూర్ (టి) నియోజకవర్గ శాసనసభ్యులు కోనేరు కోనప్పతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం మొదటి విడతలో భాగంగా జిల్లాలో 251 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని, అన్ని పనులు పూర్తి చేసుకొని ఈరోజు పాఠశాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. పాఠశాలలో బెంచీలు, వంటశాల, భోజనశాల, ప్రహరీ గోడ, అదనపు గదులు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా ఇతర అన్ని వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు.
సిర్పూర్ (టి) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యా రంగ అభివృద్ధి కోసం సమూల మార్పులలో భాగంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుందని, రాష్ట్రంలోని విద్యార్థుల శ్రేయస్సు దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, తాసిల్దార్ ప్రమోద్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఎంత చేస్తున్నా.. సర్కారు బడుల స్థితిగతులు మారడంలేదు. ఉపాధ్యాయుల కొరతతో అల్లాడుతున్నాయి. రాష్ట్రంలో 21 శాతం ప్రభుత్వ పాఠశాలలు ఏకోపాధ్యాయుడితో నడుస్తున్నాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు. వాటిలో 95 శాతం ప్రాథమిక పాఠశాలలే. రాష్ట్రంలో సాధారణ ప్రభుత్వ పాఠశాలలు, ఇతర సంక్షేమశాఖల పరిధిలోని గురుకులాలు, కేంద్ర ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు కలిపి 30,723 ఉండగా వాటిలో 6,392 చోట్ల ఒక్కరే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. అది 20.82 శాతంతో సమానం.
దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. 2017లో సింగిల్ టీచర్ స్కూల్స్ సంఖ్య 92 వేలు ఉండగా, 2021-22 విద్యా సంవత్సరం నాటికి 1.17 లక్షలకు చేరాయి. అంటే నాలుగేళ్లలో దాదాపు 25 వేలు పెరిగాయన్నమాట.
జాతీయ సగటు కంటే రెట్టింపు
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు 11.04 లక్షలున్నాయి. వాటిలో 1,17,285 పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడే చదువు చెప్పేది. అంటే అది 10.61 శాతంతో సమానం. రాష్ట్రంలో 20.82 శాతమంటే జాతీయ సగటుతో పోల్చుకుంటే దాదాపు రెట్టింపున్నట్లు స్పష్టమవుతోంది. అత్యధిక ఏకోపాధ్యాయ పాఠశాలలున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. 2017లో దేశంలో మొత్తం 92,275 సింగిల్ టీచర్ బడులుండగా.. అందులో తెలంగాణలో 4578 ఉన్నాయి.