Rohit Sharma Retirement: టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
Rohit Sharma Retirement:రోహిత్ శర్మ తన చివరి టెస్టు సిరీస్ అడుతున్నట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని సంకేతాలను ఇండియన్ కెప్టెన్ పంపించాడు.

Is Rohit Sharma Retirement From Tests: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో దీనికి సంబంధించిన సిగ్నల్స్ పంపేశాడన్న చర్చ నడుస్తోంది. నాల్గో రోజు భారీ స్కోర్ చేయలేకుండా అవుటైన రోహిత్ పెవిలియన్‌కు వస్తూ తన గ్లౌస్‌లను డౌగట్ ముందే వదిలేశాడు.
బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో నాలుగో రోజు మరోసారి కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. పాట్ కమ్మిన్స్‌కు తన వికెట్ సమర్పించుకున్నాడు. నిక్కికి క్యాచ్ ఇచ్చి అచ్చం కోహ్లీ మాదిరిగానే అవుట్ అయ్యాడు. ఇద్దరు కూడా ఆఫ్-స్టంప్ వెలుపల వెళ్లే బంతులను ఆడలేక పదే పదే అవుట్ అవుతున్నారు. ఇప్పుడు కూడా ఇద్దరూ సేమే బంతులకే అవుట్ అయ్యారు. రోహిత్‌ను కమిన్స్ ఇలా అవుట్ చేయడం ఇది రెండోసారి. టెస్టుల్లో ఆరోసారి.
ఇప్పటి వరకు రోహిత్ శర్మ గత పది ఇన్నింగ్స్‌లో ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో చేశాడు. వ్యక్తిగత కారణాలతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌కు రోహిత్ దూరమయ్యాడు. అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా చేశాడు. ఆ మ్యాచ్‌లో 295 పరుగుల భారీ విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. సిరీస్‌కు మంచి ప్రారంభాన్ని ఇచ్చింది.
పెర్త్‌లో రెండో ఇన్నింగ్స్‌లో KL రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ జోడీగా అద్భుతంగా ఆడి మంచి విజయాన్ని అందించారు. దీంతో అడిలైడ్‌లో రోహిత్ ఓపెనింగ్ రాలేదు. ఆరో నెంబర్ బ్యాటర్‌గా వచ్చి సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాడు. ఇప్పడు బ్రిస్బేన్‌లో కూడా కేఎల్ రాహుల్ 84 పరుగులు చేశాడు. దీంతో వచ్చే టెస్టుల్లో కూడా రోహిత్ ఓపెనింగ్ చేసే అవకాశం లేనట్టే.
ఇప్పటి వరకు ఆడిన తీరు ఇకపై జరగపోయే పరిణామాలు చూస్తున్న అభిమానులు విశ్లేషకులు రోహిత్ తన చివరి టెస్టు సిరీస్ ఆడేస్తున్నాడని అంటున్నారు. దీనికి తోడు ఆయన గ్లౌస్‌లు ఇలా విడిచిపెట్టి వెళ్లిపోవడం కూడా అందుకు సంకేతమని అంటున్నారు.




















