Komaram Bheem Asifabad District News: కుమ్రంభీం ఆసీఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పులి పని పట్టేందుకు కొత్త ఎత్తుగడ- రంగంలోకి దిగిన డ్రోన్ సైన్యం
Tiger Attack News: డ్రోన్ సహాయంతో పులి జాడ తెలుసుకొని ప్రజల ప్రాణాలను కాపాడవచ్చిన ఆసిఫాబాద్ జిల్లా అధికారులు భావిస్తున్నారు. పులి సంచారం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ సైన్యాన్ని దించారు.
Drones Deployed For Tiger Tracking In Komaram Bheem Asifabad District: కుమ్రంభీం ఆసీఫాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా ప్రజలకు కంటిమీద కనుకు లేకుండా చేస్తూ ప్రజలపై పంజా విసురుతున్న పులి పని పట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. కొత్త ఎత్తుగడలతో పులి జాడ కనిపెట్టి ప్రజలను రక్షించేందుకు డ్రోన్ సైన్యాన్ని రంగంలోకి దించింది. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో అణువణువూ గాలించి పులిని ప్రజల మధ్యకు రాకుండా చేయాలని ఈ ప్రయత్నం చేస్తున్నారు.
24 గంటల వ్యవధిలో ఇద్దరిపై అటాక్ చేసిన పెద్దపులి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఈ మ్యాన్ ఈటర్‌ను కట్టడి చేయకపోతే ప్రజల ప్రాణాలకే మరింత ప్రమాదమని గ్రహించిన అటవీశాఖాధికారులు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే కాగజ్‌నగర్ మండలంలోని దాదాపు పది పదిహేను గ్రామాల్లో 144 సెక్షన్ విధించి జనాలను కట్టడి చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు చేస్తున్నారు. నిత్యం పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు.
అయినా గ్రామానికి సమీపన ఉన్న పంటపొలాల్లో దాక్కొని ఉన్న పులి తరచూ గ్రామానికి సమీపంగా వస్తోంది. దీని వల్లే పొలాల్లో పని చేస్తున్న వారిపై అటాక్ చేస్తోంది. ఒకసారి మనిషి రక్తానికి అలవాటు పడిన పులి ఆ ప్రాంతంలోనే మరికొన్ని రోజుల పాటు ఉండిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇది ప్రజల ప్రాణాలకు మరింత ప్రమాదమని గ్రహించిన అధికారులు కట్టడి వ్యూహాలు వేస్తున్నారు.
పులి తిరుగుతున్న ప్రాంతాల్లో డ్రోన్లను పంపించి దాడి జాడ గుర్తిస్తారు. అక్కడి నుంచి దాన్ని అటవీ ప్రాంతానికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్న ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫలితంగా ప్రజలు అప్రమత్తమై పులి పంజా నుంచి తప్పించుకోవచ్చు.
Also Read: కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
శీతాకాలం కావడంతో పత్తి ఏరే వాళ్లు ఎక్కువ ఉదయాన్నే పొలాలకు వెళ్తుంటారు. దీన్నే అదునుగా చేసుకుంటున్న పులి అటాక్ చేస్తోంది. గుంపుగా వెళితే భయపడి పారిపోతుందని లేకుంటే ఇలానే దాడి చేసే ఛాన్స్ ఎక్కువ ఉందని అధికారులు అంటున్నారు. పత్తి చేలలో పని చేసే కూలీలు, రైతులు వంగొని పత్తిని ఏరుతుంటారు. దీని వల్ల పులి కదలికలను గుర్తించలేకపోతున్నారు. పులి రావడం కూడా చాలా సైలెంట్‌గా వస్తుంది. అలికిడి లేకుండా వస్తున్న పులి ఒక్కసారిగా పంజా విసురుతోంది. పొలాలకు గుంపుగా వెళ్లినప్పటికీ పత్తి ఏరటప్పుడు విడిపోతారు. ఇదే పులికి అవకాశంగా మారుతోంది.
కుమ్రంభీం ఆసీఫాబాద్ జిల్లా యంత్రాంగం మొత్తం కాగజ్‌నగర్ మండలోనే తిరుగుతోంది. నిరంతరం పులి కదలికలపై నిఘా పెట్టింది. ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నారు. సాధారణంగా మనిషిపై పులి దాడి చేయదని చెబుతున్నారు. రెండు రోజుల నుంచి దాడి చేస్తున్న పులి ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిందని జనాలు భయపెట్టడంతో గందరగోళానికి గురై ఇలా మనుషులను టార్గెట్ చేసుకుందని అనే అనుమానం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పులి దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి పది లక్షల పరిహారం, ఉద్యోగం ఇప్పిస్తామని అధికారులు తెలియజేశారు.
పులిదాడిలో గాయపడి కాగజ్ నగర్‌లో ప్రజాలైఫ్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేష్‌ను ఆసిఫాబాద్ డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టేబ్రివాల్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందివ్వాలని వైద్యులనుకోరారు. .
Also Read: పులి సంచారంతో వణికిపోతున్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు- కాగజ్‌నగర్ మండలంలో 144 సెక్షన్