Telangana: ఉపాధి హామీ కూలీ నుంచి రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎదిగిన ఆదివాసీ బిడ్డ
Telangana Nominated Posts | తెలంగాణ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయగా ఉపాధి హామీ కూలీ స్థాయి నుంచి ఎదిగిన కొత్నాక తిరుపతిని గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ చైర్మన్ చేసింది.
Telangana State ST Cooperative Finance Development | దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామానికీ చెందిన ఆదివాసీ నేత కొట్నాక తిరుపతిని రాష్ట్ర స్థాయి పదవి వరించింది. గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ చైర్మన్ గా కోట్నాక తిరుపతిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం (జులై 8న) ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి తల్లిదండ్రులు రాము, సుంగుబాయి.. వారి ఆరుగురు సంతానంలో నలుగురు అక్కలు కాగా, ఓ సోదరుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఉపాధి హామీ కూలీగా సైతం పనిచేసిన యువకుడు ఏకంగా రాష్ట్ర పదవి పొందే స్థాయికి ఎదిగారు. నామినేటెడ్ పదవుల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన గిరిజనుడ్ని తెలంగాణ గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వరించింది.
ఏడో తరగతి వరకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని వసతి గృహంలో చదువుకుని 8 నుంచి పదో తరగతి వరకు మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు. కొట్నాక తిరుపతిఇంటర్ మంచిర్యాలలో, డిగ్రీ హైదరాబాద్ లో పూర్తి చేసిన తర్వాత తిరుపతీ ఆదివాసీ సంఘంలో చేరారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ కు దగ్గరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చరుకుగా పనిచేస్తూ, మంచిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఏఐసీసీ ఆదివాసీ విభాగంలో జాతీయస్థాయి సంయుక్త కోఆర్డినేటర్ గా ఎన్నికయ్యారు తిరుపతి. అలాగే మంచిర్యాల జిల్లా ఆదివాసీ సేన అధ్యక్షుడిగా పనిచేశారు.
భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో పాటు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 2021లో నిర్వహించిన భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలో మీటర్ల పైగా చేసిన పాదయాత్రలో కొట్నాక తిరుపతీ రాహూల్ గాంధీతో కలిసి నడిచారు. అప్పటి నుంచి జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపు లభించింది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోను తిరుపతి ఆదిలాబాద్ కాంగ్రెస్ టిక్కెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తిరుపతిని గుర్తించి ఆయనకు గిరిజన కార్పొరేషన్ పదవిని కేటాయించింది. అయితే రైతులకు రుణాల మంజూరు, ఆశ్రమ పాఠశాలలకు నిత్యావసర సరకుల పంపిణీ, చౌకధర దుకాణాల నిర్వహణలో నిర్దేశించిన లక్ష్యాలకు దూరంగా జీసీసీ నిలుస్తోంది. ఈ సమస్యలపై దృష్టిసారించి జీసీసీ అభివృద్ధిపై దృష్టిసారించాలని అడవి బిడ్డలు కోరుతున్నారు.
ప్రభుత్వం తనకు గిరిజన కార్పొరేషన్ పదవిని కేటాయించడంపై కొట్నాక తిరుపతి హర్షం వ్యక్తం చేశారు. గిరిజనులకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పాటుపడతాననీ, ఆదివాసీల అభివృద్ధి కోసం ఎన్నో ఉద్యమాలు చేశా కాబట్టి.. ప్రభుత్వం తనపై నమ్మకంతో పదవి ఇచ్చినందుకు వమ్ము చేయకుండా గిరిజనుల సమస్యలు తీర్చి ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తానని, గ్రామ గ్రామాల్లో పర్యటించి అడవి బిడ్డల సమస్యలు తెలుసుకుంటూ వారికీ అండగా ఉంటానన్నారు.