Nizamabad News: నిజామాబాద్ జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు, ఎమ్మెల్సీ కవిత సీరియస్!
Nizamabad News : నిజామాబాద్ జిల్లా సారంగపూర్ లో అక్రమ మట్టి తవ్వకాలపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Nizamabad News : నిజామాబాద్ జిల్లా సారంగపూర్‌లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. సారంగపూర్ లో 63 ఎకరాల ప్రభుత్వ భూమిలో 40 ఎకరాల్లో జైల్ నిర్మించారు. మిగతా 23 ఎకరాల భూమిలో పండ్లతోటలు, చెట్ల పెంపకం చేపట్టేందుకు భూమిని చదును చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ఈ పనుల టెండర్ దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. భూమి చదును చేయకుండా వదిలేశారని స్థానికులు ఆరోపిస్తు్న్నారు. 6 నెలల్లో భూమి చదునుచేసే పనులు పూర్తికావాలి కానీ ఏడాది గడుస్తున్నా ఇంకా పనులు పూర్తి కానట్లు సమాచారం. అక్రమ మైనింగ్ జరిగిందని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు.
అక్రమ తవ్వకాలు
జైలు డెవలప్మెంట్ లో భాగంగా గుట్ట తవ్వడానికి మూడున్నరేండ్ల కింద ఓ కాంట్రాక్ట్ ఏజెన్సీకి జైళ్ల శాఖ బాధ్యతలు అప్పగించింది. దీని ప్రకారం గుట్టను చదును చేసి పార్కుతో పాటు కట్టడాలకు అనువుగా చేసి ఇవ్వాలి. ఇందులో భాగంగా సదరు ఏజెన్సీ తవ్విన మొరం, మట్టిని జైళ్ల శాఖ అవసరమైన మేరకు తీసుకుంటే, మిగతాది మైనింగ్ శాఖ వే బిల్లులు ఇచ్చిన వారికి అందజేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా మట్టిని అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
స్పందించిన ఎమ్మెల్సీ కవిత
ఈ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత సైతం స్పందించారు. అక్రమాలపై విచారణ జరిపించాలని కలెక్టర్ ను ఆదేశించారు. కలెక్టర్ తో ఫోనులో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు సారంగాపూర్ శివారులో దేవాదాయ శాఖ స్థలంలోనూ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. మట్టి తవ్వకాలపై గత నవంబర్ లో స్థానికులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన విచారణకు ఆదేశించగా అప్పట్లో రెండు టిప్పర్లను పది రోజుల కింద మరో రెండు ట్రాక్టర్లను రెవెన్యూ ఆఫీసర్లు సీజ్ చేశారు.