Telangana News: ధరణి పోర్టల్ తో రైతులకు తీవ్ర నష్టం, అధికారంలోకి వస్తే తీసేస్తాం: బీజేపీ
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తో ఏజెన్సీ ప్రాంత రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ సిర్పూర్ టి నియోజకవర్గ నేత డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తో ఏజెన్సీ ప్రాంత రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ సిర్పూర్ టి నియోజకవర్గ నేత డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాబాసాగర్, చింతలమానేపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా గోస - బిజేపి భరోసా శక్తి కేంద్రాల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయా కాలనిల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నిరుపేదలకు ఇల్లు కట్టించే భాధ్యతను బీజేపీ తీసుకుంటుందన్నారు.
బీజేపీ ఏర్పాటు కార్నర్ మీటింగ్ లో బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ తీసుకువచ్చి కేసీఆర్ రైతుల నడ్డి విరిచిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు నష్టం కలిగిస్తున్న ధరణి వెబ్ సైట్ ను తొలగిస్తామని స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వివాదాస్పద భూముల్లో పెద్ద ఎత్తున అలజడి చెలరేగిందని, యాజమానులు ఖాస్తుదారుల మధ్య ప్రచ్ఛన్న యుద్దానికి కారణం కేసీఆర్ అయ్యారని విమర్శించారు. కనుక వెంటనే ధరణి పోర్టల్ ను రద్దుచేసి ఏజెన్సీ ప్రాంత రైతులకు న్యాయం చేయాలని బీజేపీ నేత డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ప్రతి నిరుపేదలకు ఇల్లు కట్టించే భాధ్యతను భుజానికి ఎత్తుకుంటుందని, పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. అలాగే ధరణి పోర్టల్ ను ఎత్తివేసి రెవెన్యూ సమస్యలను పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి చింతలమానేపల్లి మండల అధ్యక్షులు రామగోని తిరుపతి గౌడ్, సర్పంచ్ చౌదరి నానయ్య, సీనియర్ నాయకులు ఎల్ములే మల్లయ్య, భాజపా మండల మహిళ అధ్యక్షురాలు జాడి సౌమ్య, మొర్లే దాయన్న, దళిత మోర్చ మండల అధ్యక్షులు దుర్గం కారు, శ్రీమన్నారయణ, తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్ సమావేశాల్లోనూ ధరణిపై రగడ
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ధరణి పోర్టల్ పై మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. ధరణి పోర్టల్ విషయంలో వీరిద్దరి మధ్య కాసేపు వాదన నడిచింది. కాంగ్రెస్ సభ్యుడైన దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ రైతుల పాలిట శాపంగా మారుతోందని అన్నారు. కొందరి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, రైతులు గందరగోళంలో ఉన్నారని అన్నారు. ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని తేల్చి చెప్పారు. ఆ వెంటనే శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ధరణి పోర్టల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సమస్యలను ఎత్తి చూపాలని చెప్పారు. అందులో లోపాలు ఉంటే సరి చేస్తామని చెప్పారు. అంతేకానీ.. ధరణి పోర్టల్ మొత్తాన్ని తొలగించబోమని తేల్చి చెప్పారు. ధరణిని రద్దు చేయడం, ప్రగతి భవన్‌ను బద్దలు కొట్టడం, బాంబులతో పేల్చివేయాలని అనడం కాంగ్రెస్ విధానామా? అని కేటీఆర్ కాంగ్రెస్ సభ్యులను సూటిగా ప్రశ్నించారు. ధరణి పోర్టల్ వల్ల సంతోషంగా ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. గత ఆరేళ్లలో 30 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయితే, ఈ ఏడాదిన్నర కాలంలోనే 23 లక్షల 92 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయని చెప్పారు. అన్నిసవ్యంగా జరిగితే ఎవరూ మాట్లాడరని, ఎక్కడో ఒక చిన్న లోపం జరిగితే భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని అన్నారు. ఒకట్రెండు లోపాలు జరిగితే రాష్ట్రమంతా గందరగోళం నెలకొందని చెప్పడం సరికాదని కేటీఆర్ అన్నారు.