Nizamabad News: నిజామాబాద్ టీఆర్‌ఎస్‌లో కోల్డ్ వార్.. ఎమ్మెల్యే వర్సెస్ జడ్పీ ఛైర్మన్
తారాస్థాయికి చేరిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు అధిపత్య పోరు. మొదట్నుంచి ఇద్దరి మధ్య పొసగని వైనం. బాహటంగానే విమర్శలు, ఆరోపణలు. ఇద్దరి మధ్య కోల్డ్ వార్.
నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీలో అధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ పీక్స్‌కు చేరినట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. మొదట్నుంచి ఈ ఇద్దరి నేతల మధ్య సఖ్యత లేదు. దాదన్న గారి విఠల్ రావు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. సీఎం కేసీఆర్ కు దగ్గరి చుట్టం. గత జిల్లా పరిషత్ ఎన్నికల్లో జడ్పీటీసీగా దాదన్నగారి విఠల్ రావు పోటీ చేయటం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇష్టం లేదన్న వాదన ఉంది. అక్కడి నుంచి వీరిద్దరి మధ్య అసలు కథ మొదలైంది. విఠల్ రావుకు జడ్పీటీసీగా టికెట్ ఇవ్వటం ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఇష్టం లేదని అప్పట్లో ప్రచారం జరిగింది. విఠల్ రావును ఓడించేందుకు ఎమ్మెల్యే జీవన్ స్కెచ్ వేసినట్లు చెప్పుకుంటారు. అలర్ట్ అయిన విఠల్ రావు ఏకగ్రీవంతో జీవన్‌రెడ్డికి ఝలక్ ఇచ్చారు. విఠల్ రావు సీనియర్ నాయకుడు కావటంతో పార్టీ అధిష్ఠానం ఆయన్ని జడ్పీ ఛైర్మన్‌గా చేసింది. అప్పటి నుంచి ఈ ఇద్దరు నేతలకు అస్సలు పొసగడం లేదు.
ఆర్మూర్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ప్రోటోకాల్ అంశం అడ్డొచ్చేది. జడ్పీ చైర్మన్ విఠల్ రావుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నుంచి సమాచారం ఉండదనే వాదన. దీనిపై విఠల్ రావు అనేక సార్లు అధిష్ఠానానికి ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. ఈ ప్రోటోకాల్ పంచాయితీ ఇటు అధికారులకు కొత్త కోట్లాట తెచ్చిపెడుతోంది. నందిపేట్ లక్కంపల్లి సెజ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రోటో కాల్ ప్రకారం జడ్పీ ఛైర్మన్ కు సమాచారం ఇవ్వలేదు. అయినా జడ్పీ చైర్మన్ కార్యక్రమానికి వెళ్లారు. జడ్పీ చైర్మన్ ను పోలీసులు అడ్డుకోవటంతో అక్కడ రచ్చ మొదలైంది. జడ్పీ చైర్మన్ ఆగ్రహానికి గురయ్యారు. ఎమ్మెల్సీ కవిత ముందే గొడవకు దిగారు. కవిత జోక్యం చేసుకుని అక్కడ వివాదం లేకుండా చూసుకున్నారు.
మాక్లూర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఎమ్మెల్యే వర్గం, జడ్పీ ఛైర్మన్ వర్గం అయ్యాయ్. ఎమ్మెల్యే కార్యక్రమాలు ఉంటే జడ్పీ చైర్మన్ వర్గం వారు వెళ్లరు. ఛైర్మన్ కార్యక్రమాలు ఉంటే ఎమ్మెల్యే వర్గం నాయకులు వెళ్లరు. ఇలా నిత్యం వీరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంటుంది. అయితే ఇది మరింత ముదిరి దాడుల వరకు వెళ్లింది.
మాక్లూర్ మండలం ముల్లంగి (బి), బోంకన్ పల్లి గ్రామాల అభివృద్ధికి తోడ్పడినందుకు జడ్పీ ఛైర్మన్ విఠల్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపినందుకు, రైతు బంధు సంబురాల్లో జడ్పీ ఛైర్మన్ తో కలిసి పాల్గొన్నందుకు ముల్లంగి సర్పంచ్ పావని భర్త శ్యాంరావునుపై ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడ్డారని శ్యాంరావు ఆరోపిస్తున్నారు. మరోవైపు మాక్లూర్ మండలంలో రైతు బంధు సంబురాల్లో జడ్పీ ఛైర్మన్ విఠరావు పాల్గొన్న వార్తను రాసినందుకు మాక్లూర్ మండలం రిపోర్టర్ పై ఎమ్మెల్యే అనుచరులు కర్రలతో దాడి చేసినట్లు రిపోర్టర్ చెప్పుకొచ్చారు. ఇలా వీరి మధ్య ఆధిపత్య పోరు దాడుల వరకూ వెళ్తోంది.
మాక్లూర్ మండలంలో నిత్యం ఇలాంటి సంఘనలు జరుగుతూనే ఉన్నాయ్. జడ్పీ ఛైర్మన్ విఠల్ రావును ఎవరైనా ఆర్మూర్ నియోజకవర్గం పార్టీ నేతలు కలిస్తే ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అస్సలు పడదని జడ్పీ ఛైర్మన్ వర్గీయులు అంటున్నారు. ఈ పంచాయితీ అధిష్టానం పెద్దల దృష్టికి వెళ్లినా ఇద్దరి నేతల్లో మార్పు రాలేదంటున్నారు జిల్లా పార్టీ నాయకులు.
Also Read: టార్గెట్ 2023... వరంగల్ లో దూకుడు పెంచిన బీజేపీ
Also Read: ఈ సంక్రాంతికి దుమ్ములేపిన చికెన్ సేల్స్.. 60 లక్షల కిలోలు తినేసిన హైదరాబాదీలు, మటన్ సేల్స్ ఎంతంటే..