Adilabad Latest News:అటవీ భూమి కబ్జా చేసిన బీజేపీ నేత అరెస్టు- పరారీలో భార్య- ఫోర్జరీ, చీటింగ్ కేసులో చర్యలు
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఓ బీజేపీ నేత ఫారెస్ట్ భూమి తనదంటూ కబ్జా చేశాడు. ప్లాట్లు చేసి విక్రయించేశాడు. అది అక్రమం అని తేలడంతో ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. ఇందులో అతని భార్య కూడా ఇరుక్కుంది.

Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా అక్రమ లేఅవుట్లు, అక్రమ ఇళ్ల అమ్మకాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన వారి తాటతీస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు. తాజాగా ఫారెస్ట్ భూమినే ఆక్రమించాడు ఓ బిజెపి నాయకుడు. ఫారెస్ట్ భూమిని లేఅవుట్లుగా మార్చి అమాయకులకు అంటగట్టాడు. ఇది ఫారెస్ట్ భూమి అని అక్రమ ప్లాట్లనీ వారికి తెలిసిన తర్వాత ఆ నేతను నిలదీశారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని అడగ్గా డబ్బులు ఇచ్చేది లేదు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి అంటూ బెదిరించాడు.
మోసపోయిన అమాయకులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. అతగాడి బాగోతం అంతా బయటపడింది. ఇప్పుడు జైలు ఊచలు లెక్కించాల్సి వస్తోంది.
ఆదిలాబాద్ డిఎస్పి ఎల్. జీవన్ రెడ్డి శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శోభ మురార్ఖర్ మావల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ భూమిని లేఅవుట్లుగా చేసి వాకులభరణం ఆదినాథ్ అమాయకులకు అమ్ముతున్నారని పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తన భార్య వాకులాభరణం రజిని పరారీలో ఉందన్నారు. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గత 2010 సంవత్సరంలో జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ శివారులోని ఫారెస్ట్ భూమిని ఆదినాథ్ విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఆ భూమి తన పేరుతో ఉందంటూ నమ్మించి ప్లాట్లు చేసి విక్రయించారు. నాలుగు ప్లాట్లు నంబర్స్ 57, 58, 59, 60ను మూడు లక్షల 30 వేలకు బాధితురాలు కొనుగోలు చేశారు. ఈ భూమిని 2022లో ఫారెస్ట్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పుడు అది ఫారెస్ట్ భూమి అని బాధితులకు తెలిసింది. దీంతో బాధితురాలు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, ఫారెస్ట్ భూమిని తమకు ఎందుకు అమ్మారని నిలదీశారు. ఆదినాథ్ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ కోర్టులో చూసుకోవాలని, మీకు నచ్చిన వారికి చెప్పుకోమని బెదిరించారు.
ఈ విషయంపై బాధితులు తెలిసిన వారిని సంప్రదిస్తే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి మోసం చేసినట్టు బయటపడింది. ఈ విషయంపై మావల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు క్రైమ్ నెంబర్ 289/25 తో 420, 467, 468, 471, 290, 506 r/w 34 ఐపిసి సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. ఇన్ని రోజులు విచారించిన పోలీసుసులు శనివారం ప్రధాన నిందితుడు వకుళాభరణం ఆదినాథ్‌ను అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు ఉంచగా 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపడం జరిగిందని తెలిపారు. అతడి భార్య రజిని పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఈ విషయంపై రెవెన్యూ అధికారులను ఫారెస్ట్ అధికారులను విచారణ చేయగా.. అది ఫారెస్ట్ భూమి అని తేలిందని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. భూ అక్రమార్కులపై ఉక్కు పాదం మోపే దిశగా ఆదిలాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలను తీసుకుంటుందని, ప్రజలను మోసం చేస్తూ, పత్రాలను సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.





















