Asifabad News: పుట్టినరోజు నాడే గుండెపోటుతో విద్యార్థి మృతి - డెడ్‌బాడీతో కేక్ కట్ చేయించిన పేరెంట్స్
Asifabad News: పుట్టిన రోజు నాడే గుండెపోటుతో చనిపోయాడో పదో తరగతి విద్యార్థి. అయితే శవంతోనే కేక్ కట్ చేయించి పుట్టిన రోజు వేడుకలు జరిపారు తల్లిదండ్రులు. ఆ తర్వాతే అంత్యక్రియలు నిర్వహించాారు.
Asifabad News: ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి 30 ఏళ్ల వయసు వారు గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారు. డ్యాన్స్ చేస్తూనో, కాలేజీలో స్నేహితులతో కబుర్లు చెబుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఒకప్పుడు యాభై ఏళ్లు దాటిన వారిలో గుండెపోటు, ఇతర గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తేవి. కానీ ఇప్పుడు యువత కూడా గుండె జబ్బుల ప్రమాదంలో పడింది. ఎక్కడికక్కడ నడుస్తూ, పని చేసుకుంటూనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా పదో తరగతి గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
అసలేం జరిగిందంటే..?
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి సి హెచ్ సచిన్ (16) ఇటీవలే గుండెపోటు బారిన పడ్డాడు. ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చిందని పడిపోయాడు. విషయం గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే అతడిని మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అతడు శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు సచిన్ ది ఈరోజే పుట్టిన రోజు. బర్త్ డే రోజే కుమారుడు చనిపోవడం జీర్ణించుకోలేని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మృతదేహం వద్దే పుట్టిన రోజు వేడుకలు జరిపారు. డెడ్‌బాడీతోనే కేక్ కట్ చేయించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న వారందరినీ కంట తడి పెట్టేలా చేసింది. అయితే కుమారుడిపై ఉన్న ప్రేమతో చివరి పుట్టిన రోజును జరపాలనుకొనే తల్లిదండ్రులు శవంతో కేక్ కట్ చేయించారు.
గుండెపోటు ఎందుకు వస్తుంది?
గుండెపోటు రావడానికి ప్రధాన కారణం రక్తనాళాల్లో రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడడం, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం జరిగితే గుండె సరిగా రక్త సరఫరా చేయలేదు. దీనివల్ల గుండెపోటు వస్తుంది. ప్రపంచంలో గుండె జబ్బుల కారణంగా ప్రతి ఏటా 17 మిలియన్లకు పైగా వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో ఐదవ వంతు మమరణాలు సంభవిస్తున్నది మనదేశంలోనే. హృదయ సంబంధ వ్యాధులు అనేక రకాలుగా ఉంటాయి అధిక రక్తపోటు వల్ల కలిగేవి, అరిథ్మియా, హృదయ ధమణి వ్యాధి ఇలా రకరకాలుగా రక్తనాళాల్లో ఇబ్బందులను కలుగ చేసే జబ్బులు ఉన్నాయి. ఏదేమైనా చివరకు జరిగేది గుండెపోటు రావడమే. అయితే గుండెపోటు వచ్చే ముందు కొన్ని ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని చాలామంది తేలిగ్గా తీసుకుంటారు.
కనిపించే లక్షణాలు
1. ఛాతి నొప్పి వస్తూ పోతూ ఉంటుంది.
2. శ్వాస సరిగా ఆడదు.
3. చేయి లేదా భుజం నొప్పి వేధిస్తూ ఉంటుంది.
4. బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఈ లక్షణాలు గుండెపోటు రావడానికి కొన్ని వారాలు లేదా రోజులు ముందు జరగవచ్చు. కొందరి విషయంలో గంటల ముందు కూడా ఇవి కనిపించే అవకాశం ఉంది. మెడ గట్టిగా పట్టేయడం, భుజం నొప్పి, అజీర్ణం, అలసట, చల్లని చెమటలు పట్టడం కూడా గుండెపోటు రాకకు ముందస్తు సంకేతాలే. అలాగే మానసిక ఆందోళన, ఏదో వినాశనం జరగబోతుంది అంటూ వచ్చే ఆలోచనలు, గుండె దడ, శ్వాస సరిగా ఆడక పోవడం కూడా తీవ్రంగా పరిగణించాల్సిన లక్షణాలు. ఇక్కడ చెప్పినవన్నీ రోజుల్లో కాసేపు వచ్చి పోతుండటంతో ఎక్కువమంది వీటిని తేలిగ్గా తీసుకుంటారు. ఇవి కొన్ని నిమిషాల పాటు లేదా సెకండ్ల పాటు కనిపించినా కూడా గుండె వైద్యులను కలిసి పరిస్థితిని వివరించడం చాలా ముఖ్యం.